Shirdi News: శిర్డీ వెళ్లే ఆలోచనలో ఉన్న వాళ్లు కొన్ని రోజులు ఆగండి
Shirdi News: శిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత పెంచడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే మే ఒకటి నుంచి బంద్ నిర్వహిస్తామని చెబుతున్నారు.

Shirdi News: శిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత పెంచడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా మే ఒకటో తేదీ నుంచి బంద్ పాటిస్తామని ప్రకటించారు. శిర్డీలోని సాయి బాబా ఆలయానికి మరితం భద్రత కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని శిర్డీ గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ లో ఆలయ భద్రతపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ మద్దతు పలికింది. ఈ నిర్ణయాన్నే శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకించారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు.
అఖిలపక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశం
గురువారం శిర్డీలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశం జరిగింది. అందులో మహారాష్ట్ర దినోత్సవమైన మే ఒకటో తేదీ నుంచి సమ్మే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కార్యాచరణను గ్రామ సభ నిర్వహించి ఈ రోజే తెలియజేస్తామని చెప్పారు. ముఖ్యంగా సాయిబాబా మందిరానికి సీఐఎస్ఎఫ్ భద్రతను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని అంటున్నారు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలన్నారు. శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని కోరారు. ఇందులో 50 శాతం ధర్మకర్తలు శిర్డీ నుంచి ఉండాలన్నారు.
సమ్మె జరిగినా తెరిచే ఉండనున్న సాయిబాబా ఆలయం
గ్రామస్థులు సమ్మెకు దిగినా భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది. సంస్థాన్ లో భక్తులు బస కూడా చేయొచ్చు. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ ఎప్పటిలాగే కొనసాగుతాయి. భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్ లోని అన్ని సౌకర్యాలు కొనసాగుతాయి. ఇతర అన్ని వ్యాపారాలను పూర్తిగా మూసివేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

