Maharastra Politics : మహారాష్ట్రలో వాట్ నెక్ట్స్ ? ఏక్‌నాథ్ షిండే సీఎం అవుతారా ?
ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని శరద్ పవార్ ఆహ్వానించారు. షిండే వైపు నుంచి తాజాగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
Maharastra Politics : మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారిపోయాయి. శివసేన ఎమ్మెల్యేలు అడిగితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానని సీఎం ఉద్దవ్ ధాకరే ప్రకటించారు. ఈ క్రమంలో శివసేన పార్టీని దాదాపుగా చీల్చేసిన ఏక్‌నాథ్ షిండే స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది. ఏక్‌నాథ్ షిండేను సీఎం పదవి చేపట్టాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆహ్వానించారు. శరద్ పవార్, సుప్రియా సూలే ఉద్దవ్ ధాకరేతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ వైపు నుంచి ఏక్ నాథ్ షిండేకు ఈ ప్రతిపాదన వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉద్దవ్ ధాకరే ప్రెస్ మీట్ తర్వాత ఏక్ నాథ్ షిండే తన స్పందనను తెలియచేస్తారని అనుకున్నా.. ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
శివసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది షిండే వర్గంలోనే !
ఏక్‌నాథ్ షిండే తన వద్ద నలభై మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా వీడియో విడుదల చేశారు. ఈ ప్రకారం చూస్తే ఉద్దవ్ ధాకరే ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఒకరిద్దరు క్యాంప్ నుంచి వెనక్కి తిరిగి వస్తూండటంతో శివసేన నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో తాను సీఎంగా వైదొలుగుతానని.. మరో శివసైనికుడు సీఎం అయితే సంతోషిస్తానని ఉద్దవ్ ధాకరే ప్రకటించారు. దీంతో మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే శివసేన అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది.
కొత్త చీఫ్ విప్‌ను నియమించుకున్న షిండే
ఏక్‌నాథ్ షిండే తమ వెనుక బీజేపీ లేదని చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహిస్తున్న సూరత్, గౌహతీలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. వారి క్యాంప్.. ఇతర రాజకీయాలు అన్నీ బీజేపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఏక్‌నాథ్ షిండే మాత్రం బీజేపీతో సంబంధం లేదంటున్నారు. తామే అసలైన శివసేన అని గుర్తించాలని ఆయన స్పీకర్, గవర్నర్‌లకు లేఖ రాశారు. అత్యధిక మంది శివసేన ఎమ్మెల్యేలు షిండే వైపు ఉన్నారు. ఆయన లేఖను గవర్నర్, స్పీకర్‌లు పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది. శివసేన జారీ చేసిన విప్ చెల్లదని చెబుతూ.. తాము ఒక విప్‌ను నియమించారు ఏక్‌నాథ్ షిండే.
ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు పరిశీలిస్తామన్న బీజేపీ
అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇంత వరకూ శివసేన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని కానీ ఉద్దవ్ ధాకరేను రాజీనామా చేయాలని కానీ కోరలేదు. ఈ అంశంపై బీజేపీ నేతలు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అంటున్నారు. మొత్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేకపోతే.. ఏక్‌నాథ్ షిండేను ఉద్దవ్ థాకరే స్థానంలో సీఎంను చేస్తారా అన్నది మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గామారింది.