వీవీప్యాట్ స్లిప్‌లు 100% లెక్కించడం కుదరదు, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు - అన్ని పిటిషన్‌లు తిరస్కరణ
EVM VVPAT Case: వీవీప్యాట్ స్లిప్‌లను 100% ఈవీఎమ్‌లతో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
EVM VVPAT Slips Case: ఈవీఎమ్, వీవీప్యాట్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలైన అన్ని పిటిషన్‌లను తిరస్కరించింది. వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను EVMలతో 100% సరిపోల్చాలంటూ వేసిన పిటిషన్‌లను కొట్టివేసింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్విహించాలన్న పిటిషన్‌నీ తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఇద్దరూ వేరువేరుగా ఈ పిటిషన్‌లపై తీర్పునిచ్చారు. Association for Democratic Reforms తోపాటు మరో ఇద్దరు వేసిన పిటిషన్‌లను బుట్టదాఖలు చేసింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. EVMలో పార్టీ గుర్తుల్ని లోడ్ చేసిన తరవాత సింబల్ లోడింగ్ యూనిట్‌ని సీల్ చేయాలని వెల్లడించింది. వాటిని కంటెయినర్లలో భద్రపరచాలని తెలిపింది. అభ్యర్థులు లేదా వాళ్ల ప్రతినిధులు ఆ సీల్‌పై సంతకం పెట్టాలని సూచించింది. ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఉన్న కంటెయినర్స్‌ని స్టోర్‌రూమ్‌లో ఈవీఎమ్‌లతో పాటు భద్రపరచాలని వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తరవాత కనీసం 45 రోజుల పాటు ఉంచాలని తెలిపింది.
మరి కొన్ని కీలక సూచనలు..
సాధారణంగా ఎన్నికల ఫలితాలు విడుదలైన తరవాత ఈవీఎమ్‌లలోని మెమరీ సెమీకంట్రోలర్స్‌ని కాల్చేస్తారు. వీటిని మరోసారి ఇంజనీర్ల బృందం ప్రత్యేకంగా వెరిఫై చేయాలని సూచించింది. ఈవీఎమ్‌లు తయారు చేసిన కంపెనీలకు చెందిన ఇంజనీర్లే ఈ పని చేయాలని స్పష్టం చేసింది. ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియ చేపట్టొచ్చని స్పష్టం చేసింది. ఫలితాలు విడుదలైన వారం రోజుల్లోగా ఇలా రిక్వెస్ట్ పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.
Supreme Court rejects all the petitions seeking 100 per cent verification of Electronic Voting Machines (EVMs) votes with their Voter Verifiable Paper Audit Trail (VVPAT) slips. pic.twitter.com/z3KEvhUaAP
— ANI (@ANI) April 26, 2024
"ఓ వ్యవస్థను గుడ్డిగా విమర్శించడం వల్ల అనవసరపు అనుమానాలు పెంచినట్టు అవుతుంది. విమర్శలు కూడా అర్థవంతంగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటేనే నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించకూడదు. వ్యవస్థపై నమ్మకం ఉంచి ప్రజాస్వామ్యాన్ని మనమే కలిసికట్టుగా బలోపేతం చేయాలి"
- సుప్రీంకోర్టు
Supreme Court says it has given two directions — one direction is after the completion of symbol loading process, the Symbol Loading Unit (SLU) should be sealed and they should be stored at least for 45 days.
— ANI (@ANI) April 26, 2024
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని దాన్ని కట్టడి చేయలేమని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం ఎలా నడుచుకోవాలో నియంత్రించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. అసలు ఈసీ పని తీరుపై అనుమానం వ్యక్తం చేయడమే విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది.