(Source: ECI/ABP News/ABP Majha)
DK Shivakumar: డీకే శివకుమార్‌కు సుప్రీంలో ఊరట, మధ్యంతర స్టే పిటిషన్ విచారణ వాయిదా
DK Shivakumar: అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ ను ఎస్సీ వాయిదా వేసింది.
DK Shivakumar: కర్ణాటకలో మొన్నటి వరకు ఎవరు గెలుస్తారా అనే చర్చ.. ఇప్పుడేమో ఇద్దరు అగ్ర నాయకుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పీఠంపై అనుభవజ్ఞులైన సిద్ధరామయ్య కూర్చుంటారా.. లేక డేరింగ్ అండ్ డ్యాషింగ్ లీడర్ డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారా అని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందిగ్ధ సమయంలోనే కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో డీకే శివకుమార్ కు తాత్కాలిక ఊరట లభించింది. అక్రమాస్తుల సంబంధిత కేసులో దర్యాప్తుపై మధ్యంతర స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రాగా దానిని జులై 14వ తేదీకి వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. దాంతో డీకేఎస్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తుపై స్టే కొనసాగనుంది.
Also Read: 135 మంది ఎమ్మెల్యేలను నేనే గెలిపించా! డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
మే 23న కర్ణాటక హైకోర్టులో విచారణ
డీకే శివకుమార్ పై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలపై దర్యాపు చేయడంపై సీబీఐ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టులోని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ బీఆర్ గవాయ్ బెంచ్ పరిశీలించింది. డీకే శివకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మే 23వ తేదీన ఇదే విషయంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుందని సుప్రీం కోర్టు బెంచ్ కు తెలిపారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్ విచారణను జులై 14వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
Also Read: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? అదొక్కటే మైనస్ అయిందా?
మనీలాండరింగ్ కేసులో విచారణ డీకే శివకుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. దీని ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఇంటిపై గతంలో దాడులు నిర్వహించింది. అదే సమయంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అప్పటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ పలుసార్లు అనుమతి కోరింది. అలా 2020లో డీకే శివకుమార్ పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా తనపై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు సీబీఐ చేస్తున్న దర్యాప్తును సవాల్ చేస్తూ డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందునే సీబీఐ తనకు నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోందని డీకే శివకుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన మధ్యంతర స్టే ఇచ్చింది. అనంతరం ఆ స్టేను పలుసార్లు పొడిగిస్తూ వచ్చింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను జులై 14వ తేదీకి తాజాగా సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సీఎం ఎవరూ అనే చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు సీబీఐ పిటిషన్ ను వాయిదా వేయడం ఒకరకంగా డీకేఎస్ కు ఊరట కల్పించినట్లయింది.