Saurav Ganguly Political Entry-రాజకీయాల్లోకి దాదా..?
సౌరభ్ గంగూలీ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రానున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
రాజకీయాల్లో ఎంట్రీ కోసమేనా..?
"జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ప్రజా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను". సౌరభ్ గంగూలీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనమైంది. ఈ ఒక్క ట్వీట్‌తో త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రానున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇప్పటికే చాలా సందర్భాల్లో గంగూలీ రాజకీయ అరంగేట్రంపై చాలా సందర్భాల్లో వార్తలొచ్చాయి. ఈ విషయంపై గంగూలీ కూడా ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తూ వచ్చారు. రాజకీయాలు మనం అనుకుంటున్నంత చెడ్డవేమీ కాదని పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు ఒక్క ట్వీట్‌తో ఈ అనుమానాలన్నీ తీరిపోయినట్టే కనిపిస్తోంది. గంగూలీ భాజపాలో చేరతారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి.
భాజపా తరపున రాజ్యసభలోకి..?
పశ్చిమ బంగలో భాజపా స్పోర్ట్స్ కోటాలో రాజ్యసభకు గంగూలీని ఎంపిక చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి పశ్చిమ బంగలో గతేడాది ఎన్నికల్లోనే సౌరవ్ గంగూలీ ఎన్నికల బరిలోకి దిగుతారని అంతా భావించారు. ఇందుకు కారణం లేకపోలేదు. అప్పట్లో భాజపా సీనియర్ నేతలు సహా అమిత్‌షాని తన ఇంటికి విందుకు ఆహ్వానించారు గంగూలీ.
ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన భాజపా నేతలకు ఆతిథ్యం అందించారు. అమిత్‌షా కుమారుడు జై షాతోనూ సౌరవ్ గంగూలీకి సాన్నిహిత్యం ఉంది. ఫలితంగానే గంగూలీ భాజపా తరపున పోటీ చేస్తారని అప్పటి ఎన్నికల్లో ఊహాగానాలు వినిపించాయి.
కానీ దాదా మాత్రం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కేవలం మర్యాద పూర్వకంగానే అమిత్‌షాను ఇంటికి ఆహ్వానించానని, రాజకీయ చర్చలేవీ జరగలేదని దాదా ప్రకటించారు కూడా. బీసీసీఐ గురించి కూడా ఆ సమయంలో ఎలాంటి చర్చ జరగలేదని,
ఒకవేళ భాజపా టికెట్ ఆఫర్ చేసినా అది తీసుకోనని అప్పుడే స్పష్టంగా చెప్పారు దాదా. ఇప్పుడు ఉన్నట్టుండి "కొత్త అధ్యాయం మొదలు పెడతాను " అని ట్వీట్ చేయటం వల్ల మరోసారి గంగూలీ రాజకీయ ఎంట్రీపై చర్చ మొదలైంది.
రాజకీయాలు చెడ్డవేమీ కాదు-దాదా
"రాజకీయాలు చెడ్డవి అని నేను అనుకోను. మన దేశంలో ఎంతో మంది గొప్ప నేతలున్నారు. వాళ్ల వల్లే దేశాభివృద్ధి సాధ్యమవుతోంది. వాళ్లే దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రజలపై రాజకీయ నాయకుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. మంచి వ్యక్తులంతా తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి. అలా అని నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. అన్ని విధాలుగా ఆలోచించుకున్నాకే ఏ పనైనా చేస్తాను" అని ఓ సందర్భంలో సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించారు. బహుశా ఈ వ్యాఖ్యలు, ట్వీట్ చూస్తుంటే క్రమంగా క్రికెట్‌కు దూరమై రాజకీయాలకు దగ్గరవుతారేమో అని పలువురు జోస్యం చెబుతున్నారు.