Sanchar Saathi Portal: 'సంచార్ సాథీ' పోర్టల్ తీసుకొచ్చిన కేంద్రం, ఫోన్ నేరాలు అరికట్టడమే లక్ష్యం
Sanchar Saathi Portal: మొబైల్ ఫోన్లతో జరిగే నేరాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ అనే పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sanchar Saathi Portal: ఆధార్ కార్డులు వచ్చినప్పటి నుండి ఏ పనికైనా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. ఈ ఒక్క కార్డు లేకపోతే ఏ పనీ జరగడం లేదు. ఇందులో కొంత వెసులుబాటు ఉన్నా.. సమస్యలు కూడా అన్నే ఉన్నాయి. మన ఆధార్ జిరాక్స్ వేరే వారి చేతికి వెళ్తే మన సమాచారం అంతా వారి చేతుల్లోకి వెళ్లినట్లే. దాంతో సిమ్ కార్డులు తీసుకుని వాటితో ఆన్ లైన్ నేరాలు చేస్తున్న ఘటనలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. ఏదైనా నేరం జరిగి పోలీసులు మన ఇంటికి వచ్చే వరకు కూడా మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర సర్కారు తాజాగా సంచార్ సాథీ అనే పోర్టల్ ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచార్ సాథీ పోర్టల్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఒకటి, రెండూ కాదు ఎన్నో ప్రయోజనాలు
తాజాగా ప్రారంభమైన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యే తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ కూడా సంచార్ సాథీ పోర్టల్ లో మొదటి అడుగుగా అభివర్ణించారు కేంద్రమంత్రి. ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ లోని సమాచారాన్ని ఎవరూ చూడకుండా దానిని సంచార్ సాథీ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వెల్లడించారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం ఒక అంశంగా పేర్కొన్నారు. నో యువర్ మొబైల్ అనే రెండో ఫీచర్ గురించి వివరించారు.
Also Read: Missing Phone CEIR App : పోయిన ఫోన్ ను కనిపెట్టే యాప్, ఇలా ఫిర్యాదు చేయాలి?
మన పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవచ్చు
ఆధార్ కార్డు ఉంటే సిమ్ తీసుకోవడం చాలా సులభం. అయితే ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో.. వాటిని ఎక్కడెక్కడ తీసుకున్నారో సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. వ్యక్తులకు తెలియకుండా వారి పేరుపై ఉన్న సిమ్ లను ఈ పోర్టల్ ద్వారా తొలగించే అవకాశం ఉంది. ఆధార్ కార్డు నంబరు సాయంతో నకిలీల గురించి తెలుసుకోవచ్చు. దొంగిలించిన ఫోన్ లొకేషన్ కనుక్కోవడంతో పాటు లీగల్ విధానంలో ఒక ఫోన్ ను పని చేయకుండా చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫోన్లకు డిటోగా ఉండే క్లోన్ ఫోన్లు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. వీటిని ఒరిజినల్ ఫోన్ గా భ్రమింపజేసే అమ్మే వారు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితిలో అది నిజమైనదో కాదో తెలుసుకోవడానికి సంచార్ సాథీ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఫోన్ ఐఎంఈఐ నంబరు సాయంతో ఆ ఫోను నిజమైనదా, నకిలీదా సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read: Whatsapp Scam Foreign Numbers | విదేశీ నెంబర్లతో కాల్స్ వస్తున్నాయా..? ఐతే జాగ్రత్త
'87 కోట్ల మొబైల్ ఫోన్లపై కనెక్షన్లను పరిశీలిస్తే.. అందులో 42 లక్షల కనెక్షన్లు నకిలీవిగా తేలింది. అందులో 36 లక్షల కనెక్షన్లను రద్దు చేశాం. మూడు విధాలైన సంస్కరణలతో సంచారా సాథీ పోర్టల్ తీసుకొచ్చాం. భారత టెలికాం సెక్టార్ ను గ్లోబల్ లీడర్ గా చేయడమే మా లక్ష్యం' అని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.