Rafah News Today: విషాదాన్ని మాటల్లో చెప్పలేం- రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ప్రముఖుల ఆవేదన!
Rafah attack : ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ ను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి.
Celebrities Comment on Israel-Gaza war : ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ ను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా తర్వాత ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు ఆదివారం రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 45 మంది మరణించారు. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా బృందం హమాస్ శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ కమాండర్‌తో సహా చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు’ అని ఐడీఎఫ్ తెలిపింది.
ఇది ఇలా ఉంటే రఫా నగరంపై దాడి ఒక విషాదకరమైన తప్పిందమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారు. పాలస్తీనియన్లు నివసిస్తున్న శరణార్థి శిబిరం టెంట్ క్యాంపునకు నిప్పుపెట్టిన ఘటనలో కనీసం 45 మంది మరణించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. సజీవ దహనమైన చిన్నారులతో సహా పౌరుల మరణాలపై పలువురు భారతీయ ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సమంత
తాజాగా రఫా నగరంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని ప్రస్తావిస్తూ స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అందుకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. ‘రఫాలో ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా రఫాపై మళ్లీ దాడి జరిగింది. ఈ భీభత్సాన్ని మాటల్లో వర్ణించలేము. సురక్షితమైన ప్రాంతం ఎక్కడా లేదు. ఈ యుద్ధం ఆగిపోవాలి.’ అని సమంత రాసుకొచ్చారు.
టీవీ నటుడు నకుల్ మెహతా
ప్రముఖ టీవీ నటుడు నకుల్ మెహతా ఇన్‌స్టా స్టోరీలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక పోస్ట్‌ని షేర్ చేశారు. ‘మీ దేశం పిల్లల తలలు నరుకుతుంటే.. మీ దేశ మనుగడకు అర్హత లేదు’ అని రాసుకొచ్చారు.
రాధికా
హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఇజ్రాయెల్ బీభత్సంపై స్పందించారు. రఫా దాడికి సంబంధించి వరుస పోస్టులు పెట్టారు. ‘నాకు ప్రస్తుతం మాటలు కరువయ్యాయి. రఫా నుంచి వెలుగులోకి వచ్చిన వీడియోలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. వాటిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇప్పటివరకు మనం చూసిన దానికంటే ఇది ఎక్కువ బాధాకరం,' అంటూ రాసుకొచ్చారు.
స్వర భాస్కర్
నటి స్వర భాస్కర్ రఫా దాడిపై తన ఆగ్రహాన్ని, నిస్పృహను వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వరుస పోస్టులు పెట్టరు. “పిల్లల తల నరికి గుడారాల్లో సజీవ దహనం చేయడంపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. తెల్లజాతి ప్రజలకు నా గుండెల్లో మాటలు లేవు, శాపాలు మాత్రమే ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.
దియా మీర్జా
సీనియర్ హీరోయిన్ దియా మీర్జా.. పాలస్తీనా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల పై స్పందించింది. అందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. పాలస్తీనాకు తన మద్దతుగా 'లెట్ గాజా లైవ్' పోస్టర్‌తో పాటు బ్లాక్, వైట్, ఎరుపు, ఆకుపచ్చ హార్ట్ ఎమోజీలను ఆమె జత చేశారు.
ఫాతిమా సనా షేక్
దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తన ఇన్‌స్టా స్టోరీలో రఫాలో పిల్లల శిరచ్ఛేదం వీడియో చూశాను. దీన్ని ఇక విస్మరించలేం. ఇది ఎప్పుడు ముగుస్తుందని ఆమె ప్రశ్నించారు.
అమీ జాక్సన్
ప్రముఖ మోడల్, హీరోయిన్ అమీ జాక్సన్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌తో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ‘అమాయక ప్రజలు మారణహోమాన్ని భరిస్తున్నారు. దాదాపు 600,000 మంది భయాందోళనలకు గురవుతున్నారు. మన సమాజం నైతిక దిక్సూచిని కోల్పోయింది. మారణహోమానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న చిత్రహింసల నుండి మన ప్రభుత్వాలు దృష్టి మరల్చకూడదు.’ అని రాసుకొచ్చారు.