Attack on Vladimir Putin: పుతిన్‌పై హత్యాయత్నం, కారుపై బాంబు దాడి చేసిన దుండగులు
Attack on Vladimir Putin: రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్టు టెలీగ్రాఫ్ వెల్లడించింది.
Attack on Vladimir Putin:
భారీ శబ్దంతో పేలిన టైర్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్టు టెలీగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఎప్పుడు ఈ దాడి జరిగిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేకపోయినా...ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అక్కడి మీడియా చెబుతోంది. పుతిన్ ప్రయాణిస్తున్న కార్ ఎడమవైపు వీల్‌ను భారీ శబ్దంతో పేలిందని, ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయట పడ్డారని టెలిగ్రాఫ్ వివరించింది. కారులో నుంచి పొగలు రావటం వల్ల వెంటనే పుతిన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పేర్కొంది. బ్యాకప్ కాన్వాయ్‌లో ఆయనను అధికారిక నివాసానికి పంపినట్టు తెలిపింది. ఓ ఎస్కార్ట్‌కు ఆంబులెన్స్ అడ్డు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. తన అధికారిక నివాసానికి వస్తుండగా ఈ దాడి జరిగింది.
గతంలోనూ హత్యాయత్నం..
ఇప్పుడే కాదు. గతంలోనూ పుతిన్‌పై పలుసార్లు హత్యాయత్నం జరిగింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు ఈ థ్రెట్ పెరిగింది. సొంత దేశంలోనే కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు పుతిన్. ఆయనపై దాడి జరగటానికి ఇదీ ఓ కారణమై ఉంటుందని అంతర్జాతీయ మీడియా భావిస్తోంది. గతంలో ఓ సారి కాకసస్ పర్యటనలో ఉండగా...పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని...ఉక్రెయిన్‌లోని డిఫెన్స్ విభాగం చెప్పింది. ఆ వివరాలు సీక్రెట్‌గా ఉంచినప్పటికీ.. 2017లో ఓసారి స్వయంగా పుతిన్ సంచలన విషయం చెప్పారు. తనను చంపేందుకు ఐదు సార్లు ప్రయత్నించారని చెప్పారు.
జెలెన్‌స్కీకి తప్పిన ప్రమాదం..
అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కూడా ప్రమాదం తప్పింది. ఓ ప్యాసింజర్ కార్ జెలెన్‌స్కీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఉక్రెయిన్ మీడియా పోర్టల్ కీవ్ ఇండిపెండెంట్...ఈ విషయాన్ని వెల్లడించింది. జెలెన్స్‌కీకి పెద్దగా గాయపడలేదని, ఆయన సురక్షితంగానే ఉన్నారని ఓ ప్రతినిధి ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన
వెంటనే...వైద్యులు జెలెన్‌స్కీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయా అని టెస్ట్ చేశారు. జెలెన్‌స్కీ కార్ డ్రైవర్‌కు కూడా పరీక్షలు చేశారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరానికి వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ అయింది. అయితే...ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై విచారణ చేపడతామని జెలెన్‌స్కీ ప్రతినిధి స్పష్టం చేశారు. కీవ్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరగటం అనుమానాలకు తావిస్తోందని ఉక్రెయిన్ ఉన్నతాధికారులు అంటున్నారు. ఎలాంటి గాయాలు కాకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. దాదాపు ఆర్నెల్లుగా రష్యా ఆక్రమణ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాలు మార్చి రష్యా సైన్యం ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గిస్తోంది. తూర్పున ఉన్న ప్రాంతాలపై రష్యా సైన్యం పట్టు సడలుతోంది. తమకు ఎంతో వ్యూహాత్మకంగా భావించే ఇజియం నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే అధీనంలోకి తీసుకుంది. వీరి ధాటిని తట్టుకోలేక రష్యా సైన్యం తూర్పు ప్రాంతాలను వదిలేసి వెళ్తోంది. ఖార్కివ్ రీజియన్‌లోనూ ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తోందని ఇటీవలే జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఆయన కారు ప్రమాదానికి గురి కావటం చర్చకు దారి తీసింది.
Also Read: Tamil Nadu Waqf Board: ఆ ఆలయం సహా గ్రామం మొత్తం మాదే: వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన