Pakistan Economic Crisis: అక్కడి కుక్కలు కూడా ఆకలితో ఉండకూడదు, పాకిస్థాన్‌కు భారత్ సాయం చేయాలి - RSS నేత
Pakistan Economic Crisis: పాకిస్థాన్ ప్రజలకు భారత్ సాయం చేయాలని ఆర్‌ఎస్ఎస్ నేత కృష్ణగోపాల్ అన్నారు.
Pakistan Economic Crisis:
దారుణమైన స్థితిలో పాకిస్థాన్..
పాకిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. అక్కడి ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట తిండి తినడానికీ అవస్థలు పడుతున్నారు. ఆహార ధాన్యాల కోసం కొట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుకుంది. కిలో పిండి ధర రూ.250కు చేరుకుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటున్న భారత్ పాకిస్థాన్‌కు సాయం చేస్తుందా..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే RSS నేత డాక్టర్ కృష్ణ గోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు.
"పాకిస్థాన్ మనల్ని సాయం కోరకపోయినా భారత్ సహకరించాలి. అక్కడి ప్రజల గురించి ఆలోచించాలి. అక్కడి కుక్కలు కూడా ఆకలితో బాధ పడకుండా చూసుకోవాలి. ఆ దేశ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భారత్ కనీసం 10-20 లక్షల టన్నుల గోధుమల్ని పాకిస్థాన్‌కు పంపితే బాగుంటుంది. కచ్చితంగా ఆ దేశం గురించి ఆలోచించాలి"
-డాక్టర్ కృష్ణ గోపాల్, ఆర్‌ఎస్‌ఎస్ నేత
కిలో పిండి కొనడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కృష్ట గోపాల్...ఆహారం కోసం అలమటిస్తున్నారని అన్నారు. 70 ఏళ్ల క్రితం భారత్, పాక్ అంతా ఒకటే అన్న సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారు. భారత్ పాక్ ఇలా దూరం దూరంగా ఉండటం తగదని, కచ్చితంగా సాయం చేయాలని కోరారు.
కాఫీల కోసం క్యూ...
ఇంత కష్టకాలంలోనూ ఉన్న డబ్బులన్నీ కాఫీల కోసం తగలేస్తున్నారు కొందరు. పేస్ట్రీల కోసం క్యూ కడుతున్నారు. అవి కూడా సాదాసీదావి కాదు. బ్రాండెడ్ షాప్‌లో కొనేస్తున్నారు. కెనడాకు చెందిన Tim Hortons కంపెనీ ఈ మధ్యే పాకిస్థాన్‌లో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. అసలే ఆర్థికంగా సతమతం అవుతున్న పాకిస్థాన్‌లో ఆ కంపెనీ ఔట్‌లెట్ ఎందుకు పెట్టిందో మరి. ఎలాగో ఔట్‌లెట్ వచ్చేసింది కదా...కాఫీలు, పేస్ట్రీలు కొనేద్దాం అంటూ పాకిస్థాన్ పౌరులంతా ఆ షాప్ ముందు క్యూ కడుతున్నారు. ఈ కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. నెల రోజుల్లోనే పాకిస్థాన్ కరెన్సీ డాలర్‌తో పోల్చితే 25%కి పైగా పడిపోయింది. పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయి. జనవరిలో ద్రవ్యోల్బణం 27%కి చేరుకుంది. గత పదేళ్లలో ఇదే అత్యధికం. మరో మూడు వారాలకు సరిపడ ఫారెక్స్ నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండానే ప్రజలు Tim Hortons ఔట్‌లెట్ వద్ద బారులు తీరుతున్నారు. అయితే...దీనిపై ఆ కంపెనీ స్పందించింది. "డబ్బులున్న వాళ్లు ఈ ధరలు అసలు లెక్క చేయడం లేదు" అని తేల్చి చెబుతోంది. ఇక్కడి మెనూ ప్రకారం ఓ కాఫీ ధర రూ.350. ఇది స్మాల్ అయితేనే. ఇక లార్జ్ కాఫీ అయితే దీనికి రెట్టింపు కట్టాలి. అంటే రూ.700 అన్నమాట. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈ కంపెనీ.