Ideas of India Summit 2023: ధర్మం వైపు నిలబడడమే మా సిద్ధాంతం, భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉంది - ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే
Ideas of India Summit 2023: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌ను ABP నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే ప్రారంభించారు.
Ideas of India Summit 2023:
ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు ప్రారంభం..
రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే ప్రారంభించారు. ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ABP Networkతో పాటు దేశ విదేశాల్లోని స్థితిగతులు, ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అంశాలపై ప్రసంగించారు.
"ఈ రోజు మనం ఎక్కడున్నాం..? రేపు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాం..? ఈ అంశాలపై చర్చించడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన మేధావులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. గతేడాది సమ్మిట్ నిర్వహించినా కరోనా భయం ఉండేది. జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. కానీ వ్యాక్సిన్‌ల వల్ల ఈ గండం నుంచి గట్టెక్కాం. ధర్మబద్ధంగా నడుచుకోవడమే ఏబీపీ నెట్‌వర్క్ సిద్ధాంతం"
-అవినాష్ పాండే, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో
ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ప్రస్తావించారు అవినాష్ పాండే.
"ఏడాది కాలంగా ఈ ఇరు దేశాల యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ప్రపంచమంతా ఇప్పుడు సందిగ్ధంలోనే ఉంది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఫలితంగా చాలా వరకు దేశాలు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వరదలొస్తున్నాయి. మరి కొన్ని చోట్ల కరవు, భూకంపాలు ఇబ్బంది పెడుతున్నాయి"
-అవినాష్ పాండే, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించీ మాట్లాడారు అవినాష్ పాండే. పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో దారుణంగా ఉందని అన్నారు.
"ఇరాన్‌లో మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. భారత్ అన్ని సవాళ్లనూ అధిగమిస్తోంది. అందుకే భారతీయుడినని చెప్పుకోడానికి ఎప్పుడూ గర్విస్తాను"
-అవినాష్ పాండే, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో