Robot Firefighter: మంటల్ని ఆర్పే రోబోలు వచ్చేశాయ్, ఇక అధికారుల పని సులువే
దిల్లీలో ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం జరగ్గా, రోబో వచ్చి మంటల్ని అదుపు చేసింది.
మంటల్ని ఆర్పేందుకు రంగంలోకి రోబోలు..
దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేందుకు ఎంతో శ్రమించింది. అయితే ఈ సిబ్బందితో పాటు ఓ రోబో కూడా వచ్చి మంటల్ని అదుపు చేసింది. అగ్నిమాపక సిబ్బందిలానే ఇది కూడా చాలా సేపు అటూ ఇటూ తిరుగుతూ మంటలు ఆర్పేసింది. ఈ రోబోలను గత నెల కేజ్రీవాల్ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం రెండు రోబోలను కొనుగోలు చేశారు. ఆస్ట్రేలియా కంపెనీ ఈ రోబోలను తయారు చేసింది. అగ్నిప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించటంలో ఈ రోబోలు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీటిని ప్రవేశపెట్టినప్పుడే వెల్లడించారు.
Our government has procured remote-controlled fire fighting machines.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2022
Our brave fireman can now fight fires from a maximum safe distance of upto 100 meters.
This will help reduce collateral damage and save the precious lives. pic.twitter.com/1NjGX3ni3B
ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేస్తాయి..
ఇప్పుడు రోహిణి ప్రాంతంలోనూ ఆస్తి నష్టం ఎక్కువగా కలగకుండా కట్టడి చేసింది ఈ రోబో. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గతంలో టిక్రీ కలాన్ అనే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మరో రోబో రంగంలోకి దిగి మంటల్ని ఆర్పింది. ఈ రిమోట్
కంట్రోల్డ్ ఫైర్‌ఫైటింగ్ యంత్రాలతో అగ్నిమాపక సిబ్బందికి అదనపు బలం వచ్చిందని, వంద మీటర్ల వరకూ నీటిని చల్లుతూ మంటల్ని అదుపులోకి తీసుకురాగలవని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఇరుకైన ప్రాంతాల్లోనూ వాడుకోవచ్చు..
ఇరుకైన ప్రాంతాల్లోనూ ఈ రోబోలను తీసుకెళ్లేందుకు వీలుంటుందని, అలాంటి చోట్ల ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడాయని అధికారులు చెబుతున్నారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్నైనా ఈ రోబోలు తట్టుకుంటాయని, సులభంగా పని పూర్తి చేస్తాయని వివరిస్తున్నారు. నిముషానికి 2, 400 లీటర్ల నీటిని విడుదల చేస్తాయి. వీటికి 140 HP ఇంజిన్లు అమర్చారను. మంటల తీవ్రత ఆధారంగా వీటి పని తీరుని కంట్రోల్ చేసేందుకూ వీలుండేలా ప్రత్యేక నాజిల్స్‌ని ఏర్పాటు చేశారు. మరో విశేషం ఏంటంటే..వీటికి సెన్సార్లతో పాటు కెమెరాలనూ అమర్చారు. గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ మంటల్ని అదుపులోకి తీసుకొస్తాయి. మొత్తానికి ఈ రోబోలు తమకు చాలా ఉపయోగపడుతున్నాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతోంది. పని ఒత్తిడిని తగ్గించటమే కాకుండా, చాలా సమర్థవంతంగా పని చేస్తున్నాయని అంటున్నారు. ఇదన్నమాట ఈ ఫైర్‌ఫైటింగ్ రోబోల కథ.
Also Read: Assam Floods: మీ ఇంటికి వస్తాను, టీ తాగి వెళ్తాను, వరద బాధితుడికి అస్సాం సీఎం హామీ
Also Read: Chandigarh news:ఆ ఐఏఎస్ కొడుకుని అధికారులు టార్చర్ చేసి చంపారా, కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు