Miss India pageant: మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన ట్రాన్స్‌జెండర్, గెలిస్తే రికార్డే
Miss India Pageant: ఢిల్లీలో జరిగే మిస్ ఇండియా పోటీలకు తిరుచ్చికి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ అర్హత సాధించారు.
Miss India Pageant:
మోడలింగ్‌పై ఆసక్తితో..
ట్రాన్స్‌జెండర్లు అనగానే చాలా మంది చిన్న చూపు చూస్తారు. వాళ్లు ఎదురుగా వచ్చినా తప్పుకుని పోతారు. ఇలాంటి అవమానాలెన్నో ఎదుర్కొంటూ కొంత మంది కుంగిపోతుంటే...ఇంకొందరు మాత్రం సమాజానికి ఎదురు నిలిచి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ కూడా అలాంటి వ్యక్తిదే. తమిళనాడులో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా..
అన్ని రంగాల్లోనూ వాళ్లు తమను తాము నిరూపించుకుంటున్నారు. కొందరు లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా దూసుకుపోతుంటే..ఇంకొందరు ఆ లక్ష్యాన్ని చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు 26 ఏళ్ల రియానా సూరి. తిరుచ్చిలోని కల్లుక్కురికి చెందిన రియానా...MSc చేశారు. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్నారు. 2019 నుంచి మోడలింగ్‌పై దృష్టి సారించారు. గతేడాది ఏప్రిల్‌లో విల్లుపురంలో జరిగిన మోడలింగ్ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. ఈ నెల ఢిల్లీలో మిస్ ఇండియా పోటీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ట్రాన్స్‌జెండర్లకు ఇలాంటి అవకాశాలు లభించడం చాలా అరుదు.
జమాల్ మహమ్మద్ కాలేజ్‌లో M.Sc చేశారు రియానా సూరి. మోడలింగ్ చేస్తూనే...ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రోత్సాహకం అందించే చారిటీలో విధులు నిర్వర్తిస్తూ.. వారికి అండగా ఉంటున్నారు. డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూనే...షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నారు. ఈ నెల ఢిల్లీలో జరగనున్న Miss India పోటీలకు గతేడాది సెప్టెంబర్‌లో ఆడిషన్ పూర్తైంది. "ఈ పోటీలో విజయం సాధించడమే నా లక్ష్యం" అని అంటున్నారు రియానా. తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం వల్ల తన లాంటి వాళ్లెందరో వెనకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నారు. "మా తల్లిదండ్రులు మాత్రమే కాదు. నా సోదరుడు సహా కుటుంబ సభ్యులంతా నాకు అండగా నిలుస్తున్నారు. నా లాంటి వాళ్లంతా సాధికారత సాధించేలా చేయడమే నా లక్ష్యం" అని వెల్లడించారు రియానా.
పదేళ్ల ట్రాన్స్‌జెండర్ ర్యాంప్ వాక్..
తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. తన పరిస్థితి చూసి సిగ్గుపడలేదు, నలుగురిలో తిరగడానికి భయపడలేదు. ఎంతో ధైర్యంగా ప్రపంచం ముందుకు వచ్చింది. తను ఎవరో కాదు నోయెల్లా మెక్ మహెర్. తన వయసు కేవలం 10 సంవత్సరాలు. ఆ పాప ప్రత్యేకత ఏమిటో తెలుసా.. తను ఒక ట్రాన్స్ మోడల్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు ఉన్న ట్రాన్స్ మోడల్ గా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. పెద్ద వయసు మోడల్స్ తో సమానంగా నోయేలా కూడ ర్యాంప్ వాక్ చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి, సెప్టెంబర్ లో జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి తనెంటో నిరూపించుకుంటుంది. ట్రాన్స్ క్లాతింగ్ కంపెనీ తరపున నోయేలా ఫిబ్రవరిలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేసింది. నోయేలా తల్లిదండ్రులు డీ, రె మెక్ మెహెర్ మాట్లాడుతూ తమ కూతురు తన కలలని నెరవేర్చుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.
Also Read: Gujarat Results 2022: ఇక జాతీయ పార్టీగా 'ఆమ్ఆద్మీ'- కేజ్రీవాల్ కల నెరవేరిందిగా!