Gujarat Results 2022: ఇక జాతీయ పార్టీగా 'ఆమ్ఆద్మీ'- కేజ్రీవాల్ కల నెరవేరిందిగా!
Gujarat Results 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్.. జాతీయ పార్టీగా అవతరించనుంది.
Gujarat Results 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసి గుజరాత్‌లో అధికారం సాధిస్తామనుకున్న ఆమ్‌ఆద్మీ ఆశలు ఆవిరైపోయాయి. కానీ ఆప్ కన్న మరో కల మాత్రం నెరవేరనుంది. ఈ ఎన్నికలతో జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ అవతరించనుంది. ఈ విషయంపై దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు.
गुजरात की जनता के वोट से आम आदमी पार्टी आज राष्ट्रीय पार्टी बन रही है.
— Manish Sisodia (@msisodia) December 8, 2022
शिक्षा और स्वास्थ्य की राजनीति पहली बार राष्ट्रीय राजनीति में पहचान बना रही है.
इसके लिए पूरे देश को बधाई.
4 రాష్ట్రాల్లో
ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉంది. ఇక ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం ఓట్లు సాధిస్తే ఆప్ జాతీయ పార్టీగా అర్హత పొందినట్లు అవుతుంది.
అంటే గుజరాత్‌లో కనీసం రెండు సీట్లు గెలిచినా సరిపోతుంది ఆప్. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆప్.. గుజరాత్‌లో ఆరు స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఒకవేళ జాతీయ పార్టీగా ఆప్ మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా నిలుస్తుంది. దీంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ ఉండనుంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావించిన ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.