వరల్డ్ టాప్ సీఈఓల జాబితాలో అంబానీకి రెండో స్థానం, మరి ముందెవరంటే?
Worlds Top CEO List:: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ టాప్ సీఈఓల జాబితో రెండో స్థానంలో నిలిచారు. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మొదటి స్థానంలో నిలిచారు.
Worlds Top CEO List: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బ్రాండ్ ఫైనాన్స్‌కి సంబంధించిన ప్రపంచ టాప్ సీఈవోల జాబితాలో ముకేశ్ అంబానీ రెండో స్థానానికి చేరుకున్నారు. అలాగే బ్రాండ్ ఫైనాన్స్ బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్-2023లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్ర స్థానంలో నిలిచారు. సుదీర్ఘ కాలం బ్రాండ్ ను నిలుపుకుంటూ కమర్షియల్ గా సక్సెస్ సాధించడం, పర్సనల్ రిప్యుటేషన్ ను కాపాడుకుంటూ సమతుల్యం చేసే సీఈఓల లిస్టును బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్ పేరుతో విడుదల చేస్తుంటుంది బ్రాండ్ ఫినాన్స్. ఈ క్రమంలోనే ప్రపంచంలోని టాప్ సీఈవోల జాబితాలో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. అయితే భారత దేశంలో మాత్రం మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లపై ముఖేష్ అంబానీ విజయం సాధించారు.
అంబానీకి వచ్చిన పాయింట్లు ఎన్నంటే..?
ఈ బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ జాబితాలో ముకేశ్ అంబానీకి 81.7 పాయింట్లు వచ్చాయి. అగ్ర స్థానంలో ఉన్న అమెరికా పారిశ్రామికవేత్త జెన్సన్ హువాంగ్ 83 పాయింట్లు సాధించారు. ముఖేష్ కేవలం 2 మార్కుల తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాను ఇండెక్స్ బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందుకోసం కంపెనీల సీఈవోల సామర్థ్యం, కంపెనీ వృద్ధిలో వారి పాత్ర, షేరు ధరలను మరింత పెంచడంలో వారి పాత్రను అంచనా వేస్తున్నారు. 2022వ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచిన సత్య నాదెళ్లను హువాంగ్ హువాంగ్, ముకేశ్ అంబానీ ఇద్దరూ అధిగమించగా.. ఆయన మూడో స్థానానికి పడిపోయారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్ 2023లో నాల్గవ స్థానంలో ఉండగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 5వ స్థానంలో ఉన్నారు. డెలాయిట్ సీఈవో పునిత్ రెంజెన్ 6వ స్థానంలోనూ, ఎస్టీ లాడర్ యొక్క ఫాబ్రిజియో ఫ్రెడా 7వ స్థానంలోనూ ఉన్నారు. టాటా సన్స్‌కు చెందిన నటరాజన్ చంద్ర శేఖరన్ ప్రపంచంలోని అత్యుత్తమ సీఈవోల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు.
టాప్ 100లో ఆరుగురు భారతీయ సీఈవోలు..
భారత దేశానికి చెందిన సీఈఓలు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టాప్ 10లో ముకేశ్ అంబానీ, ఎన్ చంద్ర శేఖరన్‌లు చోటు దక్కించుకున్నారని పేర్కొంది. అదే టాప్ 100లో ఆరుగురు భారతీయ సీఈవోలు ఉండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే మొదటి 10 మందిలో ఆరుగురు భారతీయ సంతతికి చెందిన వారు, అందులో నలుగురు భారతీయ అమెరికన్లు (సత్య నాదెళ్ల (మూడో స్థానంలో), శాంతను నారాయణ్ (నాల్గవ స్థానంలో), సుందర్ పిచాయ్ (ఐదవ స్థానంలో), పునీత్ రెంజెన్ (ఆరవ స్థానంలో) ఉన్నారు). బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్-2023 భారతీయ సంతతికి చెందిన సీఈఓలు ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపుతున్నట్లు ఈ నివేదిక రుజువు చేసింది. భారత దేశంలో చాలా మంది టెక్ దిగ్గజాలు ఉన్నారని ప్రూవ్ చేసిన ఈ నివేదికను చూసి చాలా మంది భారతీయులు మురిసిపోతున్నారు.