Republic Day 2023: ఆరు నెలల్లో తన స్వదస్తూరీతో రాజ్యాంగాన్ని రాసింది ఆయనే
Republic Day 2023: భారత రాజ్యాంగ రూపకల్పనకు అంబేద్కర్ పాత్ర ఎనలేనిది.. అలాంటి రాజ్యాంగాన్ని మాత్రం రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా.
Republic Day 2023: భారత రాజ్యాంగం జనవరి 26వ తేదీ 1950న అమల్లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే రాజ్యాంగం విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు డా. భీంరావు అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని మనం చిన్నప్పటి నుంచీ చదువుకుంటూనే ఉన్నాం. అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా పిలుస్తారు. నిజానికి డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. అందుకే ఆయనను రాజ్యాంగ నిర్మాత అని అంటారు. కానీ భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. తస స్వదస్తూరీతో రాజ్యాంగాన్ని రాశారు.
తప్పుల్లేకుండా స్వదస్తూరితో రాసిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా
ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా 1901లో ఢిల్లీలో జన్మించారు. భారత రాజ్యాంగంలోని అన్ని పత్రాలను స్వయంగా తన చేతులతో.. అందులోనూ ఒక్క తప్పు కూడా లేకుండా రాయడం నిజంగా హర్షించదగ్గ విషయమే. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా తాత రాంప్రసాద్ ఇంగ్లీష్, పర్షియన్ భాషలలో ప్రసిద్ధ పండితుడు. అతని నుంచే ప్రేమ్ బిహారీ రచనా కళను నేర్చుకున్నారు. ఆ తర్వాత రైజాదా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు. అక్కడ అతను తన కాలిగ్రాఫిక్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొన్నారు. చిన్నతనంలోనే ఈయన తల్లిదండ్రులు చనిపోతే.. తాతే ఈయనతోపాటు నలుగురు సోదరులను కూడా పెంచారు.
ఉచితంగా రాజ్యాంగం రాసిన మహనీయుడు
రాజ్యాంగం సిద్ధమైన తర్వాత భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదాను కలుసుకుని, రాజ్యాంగాన్ని ఇటాలిక్‌లో రాయమని కోరారు. అలాగే అందుకోసం ఎంత డబ్బులు కావాలని నెహ్రూ అడగ్గా.. దేవుడి దయ వల్ల తన దగ్గర అన్నీ ఉన్నాయని, తనకు డబ్బులు వద్దని చెప్పారట. కాకపోతే రాజ్యాంగంలో ముందు, చివరి పేజీల్లో తన పేరు, తన తాత పేరును రాయాలని కోరారట. ప్రేమ్ బిహారీ రైజాదా కోరికను ప్రభుత్వం అంగీకరించి అందులో ఆయన, ఆయన తాత పేరును చేర్చారు.
303 నిబ్ హోల్డర్ పెన్నులతోపాటు 254 బాటిళ్ల ఇంక్ ఉపయోగించి
రాజ్యాంగాన్ని రచించేందుకు పూణె నుంచి చేతితో తయారు చేసిన కాగితాలను తెప్పించారు. రైజాదా రాజ్యాంగాన్ని రాయడానికి 303 నిబ్ హోల్డర్ పెన్నులతోపాటు 254 ఇంక్ బాటిళ్లను ఉపయోగించారు. మొత్తం ఆరు నెలల పాటు 395 ఆర్టికల్‌లు, 8 షెడ్యూల్‌లు మరియు ఒక పీఠికతో కూడిన డాక్యుమెంట్ ప్రేమ్ బిహారీ పూర్తి చేశారు.