Ayodhya Ram Temple: అయోధ్యలో బయటపడిన పురాతన విగ్రహాలు, ఆలయ ఆనవాళ్లు
Ayodhya Ram Temple: అయోధ్యలో జరిపిన తవ్వకాలలో బయటపడిన పురాతన విగ్రహాలు, ఆలయ ఆనవాళ్లు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఎన్నో పురాతన విగ్రహాలు, పూర్వపు ఆలయ ఆనవాళ్లు తెలిసేలా కొన్ని స్తంభాలు బయటపడ్డాయిని శ్రీరామ జన్మభూమి జనరల్ సెక్రటరీ తీర్థ్ క్షేత్ర చంపత్ రాయ్ వెల్లడించారు. విగ్రహాలు, స్తంభాలకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడిమా ప్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు. పూర్వం ఉన్న ఆలయ అవశేషాలు, విగ్రహాలు, స్తంభాలు లభ్యమైనట్లు పోస్ట్ చేశారు.
అయోధ్యలో ఆలయ నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి.
అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన టల పట్ల క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అందు వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా హాని జరగదని నొక్కి చెప్పారు. ఎవ్వరిపై చిన్న గీత కూడా పడదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు సరైన రీతిలోనే ఉన్నాయని, పోలీసులు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో అలాంటి శకం ముగిసిందని అలాంటి మనస్తత్వం ఉన్నవారికి ఇప్పటికే తెలుసని అన్నారు. థాక్రే ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కేశవ్ ప్రసాద్ విలేకరులతో అన్నారు.
ఉద్దవ్ బాల్ థాక్రే (UBT) చీఫ్ ఉద్దవ్ థాక్రే ఆదివారం రోజు మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి దేశం నలు మూలల నుంచి భక్తులు తరలి వస్తారని, ఆ సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్లే సమయంలో దాడులు జరిగొచ్చని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2002లో ఫిబ్రవరి 27న అయోధ్యకి వెళ్లి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కర సేవకులపై దాడి జరిగింది. వాళ్లున్న కోచ్‌కి నిప్పంటించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అల్లర్లే ఇప్పుడూ జరుగుతుండొచ్చని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడి పుట్టించింది. "అయోధ్యలోని రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తైంది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వేలాది మంది బస్‌లు, ట్రక్‌లలో తరలి వస్తారు. వాళ్లు వచ్చి ఇళ్లకు వెళ్లిపోయే క్రమంలో దాడులు జరిగే అవకాశముంది. మరోసారి గోద్రా తరహా అల్లర్లు జరుగుతుండొచ్చు" అని థాక్రే పేర్కొన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2024 జనవరిలో ఆలయాన్ని ప్రారంభించాలని, భక్తుల కోసం గర్భగుడిని తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ సమయంలో థాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. BJP,RSSపైనా తీవ్ర విమర్శలు చేశారు ఉద్దవ్ థాక్రే. బీజేపీ సాధించింది ఏమీ లేదని, కేవలం సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెట్టినంత మాత్రాన సరిపోతుందా అని ప్రశ్నించారు. సర్దార్ పటేల్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేదని మండి పడ్డారు. ఈ విమర్శలపై బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ ఉద్దవ్ థాక్రేను విమర్శించారు.