Reservation for Agniveers : అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు - కేంద్రం కీలక నిర్ణయం !
అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనలతో కేంద్రం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న వయసు రిలాక్సేషన్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది.
Reservation for Agniveers : అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద నాలుగేళ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు రక్షణ శాఖలో ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందిన మిలటరీ ఉద్యోగార్ధులు పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. నాలుగు రోజులుగా చేపడుతున్న ఈ నిరసనలతో పలు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.
దీంతో కేంద్రం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వయో సడలింపుతో పాటు కేంద్ర సాయుధ బలగాలు ( CAPF ), అసోం రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో ఆఫర్ ఇచ్చారు. 'ఇండియన్ కోస్ట్‌గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు రక్షణ రంగం కిందకు వచ్చే 16 శాఖల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌కు అదనంగా ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ నిబంధనలు అమలు చేసేందుకు సంబంధిత రిక్రూట్‌మెంట్ నియమాలకు అవసరమైన సవరణలు చేపట్టనున్నారు. రక్షణ రంగ సంస్థలకు ఇలాంటి సవరణలు చేయాలని సూచిస్తామని, వయోపరిమితి సడలింపు కూడా చేయనున్నట్లు తెలిపారు.
The 10% reservation will be implemented in the Indian Coast Guard and defence civilian posts, and all the 16 Defence Public Sector Undertakings. This reservation would be in addition to existing reservation for ex-servicemen.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022
అగ్నిపథ్‌లో నాలుగేళ్ల సర్వీసు అనంతరం 'అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్'తో సీఏపీఎఫ్ , రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. స్వయం ఉపాధి కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. దానికి తోడు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పిచాలని నిర్ణయించుకుంది.