Bengal Train Tragedy: మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం, బెంగాల్ రైలు ప్రమాదంపై రాహుల్ అసహనం
Kanchenjunga Express Accident: బెంగాల్ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వరుస ప్రమాదాలే నిదర్శనమని విమర్శించారు.
Kanchenjunga Express Tragedy: బెంగాల్ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రైల్వే సేఫ్‌టీని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండి పడ్డారు. గత పదేళ్లలో ఇలాంటి ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మోదీ సర్కార్‌ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యాక్సిడెంట్‌లలో మోదీ సర్కార్‌కి ట్రాక్ రికార్డ్ ఉందని సెటైర్లు వేశారు.
"బెంగాల్ రైలు ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. గత పదేళ్లలో మోదీ హయాంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇవాళ జరిగిన ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. బాధ్యత ఉన్న ప్రతిపక్షంగా దీనిపై మేం పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మోదీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
पश्चिम बंगाल में कंचनजंगा एक्सप्रेस के दुर्घटनाग्रस्त होने से कई लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2024
सभी शोकाकुल परिजनों को मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र से शीघ्र स्वस्थ होने की आशा करता हूं। सरकार को सभी पीड़ितों या उनके परिवारों को तुरंत पूरा…
ఒకేట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాంచజనంగ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉండగా వెనక నుంచి గూడ్స్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ధాటికి బోగీలు చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. గాయపడ్డ వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వీళ్లకి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వేగంగా స్పందించి ఉంటే ప్రాణనష్టం ఇంతగా ఉండేది కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై విచారణ మొదలైంది. రెడ్ సిగ్నల్‌ని జంప్ చేసి గూడ్స్ ట్రైన్ వచ్చిందని, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే..మరి కొన్నింటిని దారి మళ్లించింది.