Raghuramakrishna Raju: ఆ తీర్పునకు కనీసం ఆర్నెల్లు! బాబు క్వాష్ పిటిషన్‌పై రఘురామ వ్యాఖ్యలు
MP Raghuramakrishna Raju: సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. క్వాష్ పిటిషన్ లో నిర్ణయం వెలువరించిన ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారని అన్నారు.
Skill Development case: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో గతేడాది దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు రిఫర్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్వాష్ పిటిషన్ లో నిర్ణయం వెలువరించిన ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారని అన్నారు. ఈ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారని.. మరో న్యాయమూర్తి ద్వివేది మాత్రం ఆ సెక్షన్ వర్తించబోదని అన్నారని గుర్తు చేశారు. దీంతో ఈ కేసు తేల్చడానికి ద్విసభ్య ధర్మాసనం.. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించిందని చెప్పారు.
ఇకపై త్రిసభ్య ధర్మాసనం ఎంత వేగంగా వాదనలు విన్నప్పటికీ తీర్పు రావడానికి మరో 6 నెలల సమయం పడుతుందని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఆయనకు ఇబ్బంది ఏమీ కలగదని అన్నారు. రాబోయే రోజుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిద్దామని అన్నారు. బెబ్బులిపులి సినిమాలో కోర్టు కోర్టుకు తీర్పు మారుతుందని డైలాగ్ ఉన్నట్లుగా కోర్టు తీర్పులు ధర్మాసనాలను బట్టి మారిపోతూ ఉంటాయని అన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఏ అడ్డంకులు లేకపోవడంతో ఎన్నికలకు హుషారుగా వెళ్తారని అన్నారు. పూర్తిస్థాయి తీర్పు వస్తే బావుండేదని ఎంపీ రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.