Puri Ratna Bhandar: పూరీ రత్న భండార్‌పై పెరుగుతున్న ఉత్కంఠ, ఎలా తెరవాలో ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
Ratna Bhandar: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SOPని ఖరారు చేసి ఆ మేరకు ఈ ప్రక్రియను చేపట్టనుంది.
Puri Ratna Bhandar Opening: పూరీ జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారం (Puri Ratna Bhandar) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందులో నిధులను ఎవరూ ముట్టుకోకుండా విషసర్పాలు కాపలా కాస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వీటని పుకార్లు తీసుకోవద్దని కచ్చితంగా నిజమేనని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కచ్చితంగా కొండ చిలువలు ఉంటాయని, లోపలికి వెళ్తే అవి మింగేస్తాయని హెచ్చరిస్తున్న వాళ్లూ ఉన్నారు. స్థానికంగానూ రత్న భాండాగారం (Shree Jagannath Temple) గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారులు ఈ గదిని తెరవాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గదిని తెరిచేందుకు అనుసరించాల్సిన విధానాల్ని ఖరారు చేయనుంది. ఇందుకు సంబంధించి ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని ప్రకటించనుంది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో Ratna Bhandar మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అయితే...ఆలయంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి రావడం వల్ల ఈ గదిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ భాండాగారం చుట్టూ ఎన్నో కథలు వినబడుతూనే ఉన్నాయి. జులై 14న గదిని తెరిచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే SOPనీ ఖరారు చేసేందుకు సిద్ధమైంది.
ఒడిశా హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ బిశ్వంత్ రథ్‌తో (Ratna Bhandar Opening) కూడిన ఓ కమిటీని ఏర్పాటు కాగా అందులో 16 మంది సభ్యులున్నారు. ఈ కమిటీయే రత్న భండార్ గదిని తెరిచే ప్రక్రియని పరిశీలించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా SOPని ఫాలో అవ్వాలని ఈ కమిటీయే సూచించింది. SOP ప్రకారమే ఈ ప్రక్రియ చేపట్టాలన్న కమిటీ ప్రతిపాదనకు శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ SOPని పూర్తి స్థాయిలో ఆలయ కమిటీ పరిశీలించింది. అందులో కొన్ని మార్పులు చేర్పులూ సూచంచింది. ప్రస్తుతం ఇది ప్రభుత్వం పరిధిలో ఉంది. ఒక్కసారి ఆమోద ముద్ర పడగానే అధికారికంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖా మంత్రి ఓ ప్రకటన చేశారు. త్వరలోనే SOPని ఖరారు చేస్తామని వెల్లడించారు.
దాదాపు 46 ఏళ్ల తరవాత ఈ భాండాగారాన్ని తెరుస్తున్నారు. అందుకే ఈ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. జులై 14న భాండాగారం తలుపు తెరవాలని జులై 9న జరిగిన మీటింగ్‌లో నిర్ణయించింది ఆలయ కమిటీ. ఈ గదిని తెరిచిన తరవాత Archaeological Survey of India (ASI) నేతృత్వంలో లోపల మరమ్మతులు జరగనున్నాయి. అవసరమైతే 24 గంటల పాటు పని చేసి వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ గదిలోని విలువైన ఆభరణాలను వేరే చోటకు తరలించాలనీ భావిస్తున్నారు. లీగల్‌గా ఎలాంటి చిక్కులూ రాకుండా చూసుకుంటున్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ భాండాగారాన్ని తెరిపిస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు జులై 14న గదిని తెరిపించి చరిత్ర సృష్టించనుంది.