Punjab Political Crisis: కొత్త 'కెప్టెన్ కోసం' కాంగ్రెస్ వేట.. పార్టీకి అమరీందర్ టాటా!
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ మళ్లీ అయోమయంలో పడింది. కొత్త సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలోనని మల్లగుల్లాలు పడుతోంది.
పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి సరికొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తదుపరి సీఎం కోసం ఇప్పటికే అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ కమిటీ సమావేశం కానుంది.
కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మేకన్, హరీశ్ రావత్, హరీశ్ చౌదరీ కూడా ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులను హాజరు కావాలని పార్టీ ఆదేశించింది.
కాంగ్రెస్‌కు షాక్..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు అంతర్గత కలహాలు ఉన్నా సద్దుకుపోయిన అమరీందర్.. ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయితే తదుపరి సీఎం పదవికి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ సునీల్ జాఖర్ వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అమరీందర్ అసంతృప్తి..
రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన స్ఖానంలో సీఎం పదవికి సిద్ధూను ఎంపిక చేస్తే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయనకు ఆ అర్హత లేదని వ్యాఖ్యానించారు.
'నన్ను అవమానించారు..'
పార్టీ వీడుతారా..
ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు అమరీందర్ సింగ్ చెప్పినప్పటికీ.. పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.