Amritpal Singh: పోలీసుల సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం, అప్పటి వరకూ డ్యూటీలోనే ఉండాలని కండీషన్
Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ అన్వేషణలో ఉన్న పోలీసులకు ఏప్రిల్ 14వ తేదీ వరకూ సెలవులు రద్దు చేశారు.
Amritpal Singh:
పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు..
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. రేపో మాపో పోలీసుల ఎదుట లొంగిపోతారని వార్తలు వస్తున్నప్పటికీ...అవేవీ నిజం కావడం లేదు. పైగా పోలీసులకే సవాలు విసురుతూ వీడియోలు విడుదల చేస్తున్నాడు అమృత్ పాల్. నేరుగా మా ఇంటికే వచ్చి పట్టుకోవచ్చుగా అంటూ సెటైర్లు వేస్తున్నాడు. పంజాబ్ పోలీసులు మాత్రం ఇంకా అమృత్ పాల్ కోసం గాలిస్తూనే ఉన్నారు. క్షణం కూడా తీరిక లేకుండా డ్యూటీలోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ అందరి లీవ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 14న పంజాబీలకు కీలకమైన సర్‌బత్ ఖల్సా కార్యక్రమం జరగనుంది. ఆ సందర్భంగా అకల్ తక్త్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పైగా..ఈ వేడుకలు చేయాలని అమృత్ పాల్ సింగే సూచించాడు. ఆ రోజే అమృత్ పాల్ లొంగిపోతాడన్న వాదనా వినిపిస్తోంది. అందుకే అప్పటి వరకూ పోలీసులు నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో అందరి సెలవులనూ రద్దు చేశారు. ఇప్పటికే లీవ్ సాంక్షన్ చేసిన వారికీ క్యాన్సిల్ చేసేశారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. గెజిటెడ్‌తో పాటు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సెలవులనూ రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అకల్ తక్త్ చీఫ్ జతేర్‌దాస్‌తోనూ మాట్లాడాడు అమృత్ పాల్. అయితే...సిక్కుల్లోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను సంప్రదించి సర్బత్ ఖల్సా నిర్వహించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనుంది అకల్ తక్త్.
జాడ చిక్కడం లేదు..
పారిపోయిన ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్‌ను అరెస్టు చేసేందుకు మార్చి 18వ తేదీ నుంచి కేంద్ర భద్రతా సంస్థలు, పంజాబ్ పోలీసులు ఆపరేషన్ అమృత్ పాల్‌ను ప్రారంభించారు. అయితే రెండు వారాలు గడుస్తున్నా అమృత్ పాల్ జాడ పోలీసులకు చిక్కలేదు. అయితే బైసాఖికి ముందు రానున్న రోజుల్లో అమృత్ పాల్ సింగ్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలోని అకల్ తఖ్త్ ముందు లొంగిపోవచ్చని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం.. అమృత్ సర్‌లో పోలీసులకు లొంగిపోవడంలో ఏదైనా సమస్య ఉంటే.. భటిండాలోని దామ్‌దామా సాహిబ్ లేదా ఆనంద్‌పూర్ సాహిబ్ జిల్లాలోని శ్రీ కేష్‌ఘర్ సాహిబ్ ముందు లొంగిపోవాలనే ఆలోచనలో అమృత్ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు, భద్రతా సంస్థలు ఈ మూడు చోట్ల ప్రాంతాన్ని కంటోన్మెంట్‌గా మార్చాయి. అమృత్ పాల్ లొంగిపోయే లోపే అతడిని పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అమృత్‌పాల్ తన సహచరుల సాయంతో గత 48 గంటలుగా అమృత్ సర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పరారీలో ఉన్న తనను అరెస్ట్ చేయాలని పోలీసులకు, భద్రతా సంస్థలకు సవాలు చేస్తూ అమృత్ పాల్ సింగ్ గురువారం వీడియోను విడుదల చేశాడు. ఇందులో తాను పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పాడు.