Porsche Case: పుణే పోర్షే కేసులో మరో పరిణామం, డ్రైవర్‌ని బంధించి బెదిరించిన నిందితుడి తాత అరెస్ట్
Porsche Crash Case: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ కేసులో నిందితుడి తాతయ్య సురేంద్ర అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Porsche Crash Case Updates: పుణే పోర్షే యాక్సిడెంట్ కేసులో (Pune Porsche Crash Case) నిందితుడి తాతయ్య సురేంద్ర అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకోవాలని సురేంద్ర డ్రైవర్‌పై ఒత్తిడి చేసినట్టు ఆరోపణలొచ్చాయి. పోలీసులకు ఇలాగే వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సురేంద్ర అగర్వాల్‌ని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సమయంలో అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై నమోదైన మూడో కేసు ఇది. అంతకు ముందు పోలీసులు సురేంద్ర అగర్వాల్‌ని విచారించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు కొడుకు, మనవడితో జరిగిన సంభాషణల ఆధారంగా విచారణ కొనసాగించారు. రియాల్టీ సంస్థ పేరుపైన పోర్షే కాస్ రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. ఆ కంపెనీ యజమానుల్లో సురేంద్ర అగర్వాల్ కూడా ఒకడు. ఇప్పటికే చోటా రాజన్ గ్యాంగ్‌తో లింక్స్ ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ కేసు విచారణ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులోనూ అరెస్ట్ అయ్యాడు.
డ్రైవర్‌ని బెదిరించి...బంధించి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌పై సురేంద్ర అగర్వాల్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ నేరం తానే చేసినట్టు అంగీకరించాలని బెదిరించాడు. ఏదో విధంగా నేరం ఒప్పుకుని అరెస్ట్ అయితే బయటకు తీసుకొచ్చే బాధ్యత తనదే అని తేల్చి చెప్పాడు. డ్రైవర్ ఫోన్ లాక్కుని ఇంట్లోనే బంధించాడు. ఆ తరవాత డ్రైవర్ భార్య వచ్చి విడిపించింది. నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్‌కి గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌తో లింక్స్ ఉన్నట్టు ఇప్పటికే తేలింది. ఓ ల్యాండ్ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఆ గ్యాంగ్‌కి సురేంద్ర సుపారీ ఇచ్చాడు. ఓ వ్యక్తిపై దాడి చేయించాడు. ఈ కేసుని CBI విచారిస్తోంది. సిటీలో బడా రియల్టర్‌గా పేరొందిన నిందితుడి తండ్రి కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. పుణే నుంచి గోవాకి పారిపోవాలని చూశాడు. రకరకాల కార్లలో ప్రయాణించి పోలీసుల కళ్లుగప్పాడు. చివరకు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రమాదం జరగడానికి ముందు నిందితుడైన మైనర్ పబ్‌లో మద్యం సేవించినట్టు తేలింది. మద్యం మత్తులో పోర్షే వేగంగా నడిపి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి తీవ్రంగా స్పందించారు. ఇది ప్రమాదం అనుకోలేమని, కచ్చితంగా హత్యగానే పరిగణించాలని తేల్చి చెప్పారు. ఓ మైనర్ డ్రైవింగ్ చేయడమే తప్పంటే మద్యం సేవించి నడపడం మరో పెద్ద తప్పు అని మండి పడ్డారు. మైనర్ అని వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండుంటే తన కొడుకు బతికే ఉండేవాడని అన్నారు.
Also Read: PM Modi: మోదీ బస చేసిన హోటల్‌కి బిల్ ఎగ్గొట్టిన అధికారులు, లీగల్ యాక్షన్‌కి సిద్ధమైన యాజమాన్యం