Chargesheet against Allu Arjun: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 అల్లు అర్జున్ - కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
Sandhya Theatre stampede Case: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ 11గా చేర్చారు.

Sandhya Theatre stampede Case chargesheet: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో పోలీసులు విచారణ పూర్తి చేశారు. కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. అల్లు అర్జున్ పై కూడా అభియోగాలు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు 23 మందిపై ఛార్జిషీట్ దాఖలయింది. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్.. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడతారని ముందే తెలిసినప్పటికీ, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా అక్కడికి రావడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా , ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనకు అల్లు అర్జున్ పరోక్షంగా బాధ్యుడని పోలీసులు అభియోగాలు మోపారు.
దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది , 8 మంది బౌన్సర్ల పేర్లను చేర్చారు. జనాలను నియంత్రించడంలో విఫలమవ్వడమే కాకుండా, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. అల్లు అర్జున్‌ను పోలీసులు ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా చేర్చి, అధికారికంగా అరెస్ట్ ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ కూడా ఈ ఘటనలో ప్రధాన బాధ్యులుగా తేలారు. థియేటర్ సామర్థ్యానికి మించి జనాలు వస్తున్నారని తెలిసినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో విఫలమవడం వల్లనే ఈ ప్రాణనష్టం జరిగిందని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేశారు. థియేటర్ వద్ద కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిరూపించారు.ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లడంతో, అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది.
సంధ్యా ధియేటర్ క్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. శ్రీతేజ్ మెదడుకు గాయం కావడంతో కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్రీతేజ్ పేరుతో రెండు కోట్లు డిపాజిట్ చేశారు. ఆ వడ్డీతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను పుష్ప నిర్మాతలు, అల్లు అర్జున్ భరిస్తున్నారు. తొక్కిసలాట జరిగి ఏడాది అయిన సందర్భంగా శ్రీతేజ్ ను పలువురు పరామర్శించారు.





















