Modi Dinner : జీ20 కోసం డ్యూటీ చేసిన పోలీసులతో ప్రధాని మోదీ డిన్నర్, ఎప్పుడంటే!
Modi Dinner : జీ20 కోసం డ్యూటీ చేసిన పోలీసులతో డిన్నర్ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ 20 సదస్సు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన దిల్లీ పోలీసులను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర వారితో ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగిన జీ 20 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దేశాధినేతలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరం మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి హోటళ్ల దాకా, సమావేశ ప్రాంగణం నుంచి వారు వెళ్లే మార్గాలన్నింటిలో పోలీసులు పటిష్ఠమైన భద్రతను అందించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాయశక్తులా కృషి చేశారు. దీంతో ప్రధాని మోదీ వారి కృషిని మెచ్చుకునేందుకు వారితో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు.
సెప్టెంబరు 16న శనివారం మోదీ దాదాపు 450 మంది దిల్లీ పోలీసులతో కలిసి డిన్నర్ చేయనున్నారు. వీరంతా సదస్సు సమయంలో సెక్యురిటీగా విధులు నిర్వర్తించిన వారు. జీ 20 సదస్సుకు విధులు నిర్వహించిన పోలీసుల వివరాలను తెలియజేయమని దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్లను అడిగినట్లు సంబంధిత వర్గా సమాచారం. సదస్సుకు సంబంధించిన విధులను సక్రమంగా నిర్వర్తించి సమావేశాలు విజయవంతం చేసినందుకు డ్యూటీ చేసిన పోలీసులకు రెండు రోజుల సెలవు ఇచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. తాజాగా వారికి మోదీతో విందులో పాల్గొనే అవకాశం వచ్చింది.
జీ 20 సమావేశాల కోసం దిల్లీ పోలీసులు వరుసగా సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు విరామం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. వివిధ దేశాల నుంచి దేశాధినేతలు, అధికారులు, ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు దిల్లీకి వచ్చిన నేపథ్యంలో వారి భద్రత కోసం రేయింబవళ్లు పనిచేయాల్సి వచ్చింది. దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోరా ఇచ్చిన అధికారిక ఉత్తర్వు ప్రకారం సదస్సు కోసం పనిచేసిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందించారు. నిబద్ధతతో పనిచేసినందుకు ప్రశంసలు, ధన్యవాదాలు తెలియజేసేందుకు అర్హులు అని, వారి సహకారం, భాగస్వామ్యం, వృత్తి పట్ల నిబద్ధత, ఇచ్చిన పనిని పూర్తి చేయడం పట్ల గర్వపడుతున్నట్లుపేర్కొన్నారు. సిబ్బందికి వారి ఫొటోలతో కూడిన కమెండేషన్ డిస్క్‌లను అందించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ 20 సదస్సు సెప్టెంబరు 9,10 తేదీల్లో జరిగింది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో రెండు రోజుల పాటు జీ 20 సమావేశం జరిగింది. ప్రపంచ దేశాధినేతలకు ఆతిథ్యం ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. దీంతో దేశ రాజధాని అంతట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన సతీమణి అక్షతా మూర్తి, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, జపాన్, యూరోపియన్ యూనియన్, జర్మనీ సహా పలు దేశాధినేతలు వచ్చారు. రష్యా, చైనా దేశాల అధినేతలు సమావేశానికి హాజరుకాలేదు. అలాగే సదస్సు నేపథ్యంలో ప్రపంచాధినేతలకు రాష్ట్రపతి విందు కూడా ఇచ్చారు. దీనిని కూడా చాలా ఘనంగా భారతీయ సంప్రదాయ వంటలను రుచి చూపించే విధంగా ఏర్పాటు చేశారు. రాజధాని అంతటా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. అలాగే మన దేశీయ ఉత్పత్తులు, సంప్రదాయ కళలకు సంబంధించిన వాటిని దేశాధినేతలకు బహుమతులుగా ఇచ్చారు.