New Parliament: ఇది కేవలం భవనం కాదు, ప్రజాస్వామ్యానికి మందిరం - ప్రధాని మోదీ
New Parliament: కొత్త పార్లమెంట్ భవనం కోట్లాది మంది ప్రజలక కలల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
PM Modi Speech:
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్లో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రతి దేశ చరిత్రలో కీలకమైన క్షణాలు ఉంటాయని, ఇప్పుడది చూస్తున్నామని వెల్లడించారు. ఇది కేవలం భవనం కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, కలలకు ప్రతిబింబం. భారత దేశ ప్రజాస్వామ్యానికి ఇది "ఆలయం" అనే సందేశాన్ని ప్రపంచానికి ఇద్దాం. దేశ ప్రజలకు అభినందనలు. ఈ కొత్త భవనం...స్వాతంత్య్ర సమర యోధుల కలల్ని ప్రతిఫలించేందుకు వేదికగా మారుతుంది. ఇది ఆదర్శమైన భవనం. కొత్త దారులు వెతుక్కున్నాం. కొత్త ఆలోచనలున్నాయి. ఇది ఆత్మనిర్భరతకు నిదర్శనం. భారత్...ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓ వ్యవస్థ కాదని, అదో సంప్రదాయం అని అన్నారు. పవిత్రమైన సెంగోల్‌కి సముచిత గౌరవం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH | The new Parliament isn't just a building, it is the symbol of the aspiration of the 140 cr people of India. It gives a message to the world about India's determination: PM Modi#NewParliamentBuilding pic.twitter.com/15XxWp8bZF
— ANI (@ANI) May 28, 2023
"ఈ పార్లమెంట్ కేవలం పరిపాలనా భవనం కాదు. 140కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. భారత దేశ అంకిత భావమేంటో ప్రపంచానికి చాటి చెప్పే నిర్మాణమిది. ఆత్మనిర్భర భారత్‌కి ఇది నిలువెత్తు నిదర్శనం. సంకల్పానికి, న్యాయానికి, కర్తవ్యానికి ప్రతీక అయిన సెంగోల్‌ని పార్లమెంట్లో పొందుపరచడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆ రాజదండానికి సముచిత గౌరవం దక్కింది. సెంగోల్ స్ఫూర్తి ఈ సభలో కనిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. సెంగోల్‌ని ఈ పార్లమెంట్లో పొందుపరచడం మనందరి అదృష్టం"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచ పురోగతినీ నిర్దేశించగల సత్తా ఈ పార్లమెంట్‌కి ఉందని అన్నారు ప్రధాని. ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లిలాంటిదన్న ఆయన...భారత్ ముందుకెళ్తే ప్రపంచమూ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని లీడ్ చేసే సామర్థ్యం భారత్‌కి ఉందని వెల్లడించారు.
"ప్రపంచ పురోగతిని నిర్దేశించే సత్తా భారత్‌కి ఉంది. డెమొక్రసీకి తల్లి లాంటిది మన దేశం. కొన్నేళ్ల పాటు విదేశీయుల పాలనలో మగ్గిపోయి మన దేశం గౌరవాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ రాచరిక పాలనా విధానానికి స్వస్తి పలికింది. అన్ని విధాలుగా భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. గ్రామాలు వెలిగిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తున్నాం. పంచాయతీ కార్యాలయం నుంచి పార్లమెంట్ వరకూ అంతా దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నాయి. పాత పార్లమెంట్లో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. భవిష్యత్‌లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్‌ని నిర్మించాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్న ప్రధాని మోదీ...ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని వెల్లడించారు. భారత దేశ అభివృద్ధి..మిగతా దేశాల్లోనూ ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. మరో పాతికేళ్లలో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటి లోగా భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్లో రూపు దిద్దుకునే ప్రతి చట్టం దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలవుతాయని వెల్లడించారు మోదీ.
"పంచాయత్ భవనాల నుంచి పార్లమెంట్ వరకూ మా లక్ష్యం ఒక్కటే. దేశాన్ని అభివృద్ధి చేయడం. ఈ కొత్త పార్లమెంట్‌ని నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే సమయంలో గత 9 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చాం. 11 కోట్ల మరుగు దొడ్లు అందుబాటులోకి వచ్చాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ