Joe Biden on PM Modi: మోదీజీ మీకు చాలా పాపులారిటీ ఉంది, ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ - బైడెన్ సరదా వ్యాఖ్యలు
Joe Biden on PM Modi: జో బైడెన్ ప్రధాని మోదీతో సరదా వ్యాఖ్యలు చేశారు.
Joe Biden on PM Modi:
జీ7 సదస్సులో భేటీ..
ప్రస్తుతం G7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లారు ప్రధాని మోదీ. వచ్చే నెల అమెరికాలో పర్యటించనున్నారు. అయితే...G7 సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వచ్చారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తరవాతే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమయంలోనే బైడెన్ ప్రధాని మోదీతో చాలా సరదాగా మాట్లాడారు. అమెరికా ప్రజలంతా మీ గురించి ఎదురు చూస్తున్నారని చెప్పారు. జూన్‌లో మోదీ అమెరికా వెళ్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది అగ్రరాజ్యం. స్పెషల్ డిన్నర్ కూడా ప్లాన్ చేసింది. దీన్ని ప్రస్తావిస్తూనే బైడెన్ మోదీతో మాట్లాడారు. మీ ఆటోగ్రాఫ్ కావాలని అడిగారు. "మీ వల్ల నాకు కొత్త చిక్కొచ్చి పడింది" అని సరదాగా కామెంట్ చేశారు.
"మోదీజీ మీరు నాకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారు. వాషింగ్టన్‌లో వచ్చే నెల మీతో కలిసి డిన్నర్‌కి ప్లాన్ చేశాం. చాలా మంది అమెరికన్‌లు ఈ డిన్నర్‌కి రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఆ డిన్నర్‌కి సంబంధించిన టికెట్ బుకింగ్ మొదలు పెట్టాం. ఇప్పుడు ఎవరికీ టికెట్‌లు ఇవ్వలేనంత డిమాండ్ పెరిగిపోయింది. నేను జోక్ చేస్తున్నా అనుకోకండి. కావాలంటే మా టీమ్‌ని అడగండి. నాకు చాలా మంది ప్రముఖులు కాల్ చేసి మరీ టికెట్ కావాలని అడిగారు. మూవీ స్టార్స్ నుంచి మా బంధువుల వరకూ అందరూ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చాలా పాపులర్ అయిపోయారు మోదీజీ. ప్రతి అంశంపైనా మీ ఇంపాక్ట్ కనిపిస్తోంది. వాతావరణ మార్పుల విషయంలోనూ మీ ఆలోచన విధానం మారిపోయింది. ఇండో పసిఫిక్ విషయంలోనూ ఇంతే. ప్రతి అంశంలో మీ మార్క్ కనిపిస్తోంది."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కూడా ఇదే విషయం ప్రస్తావించారు. అహ్మదాబాద్‌లో 90 వేల మంది తనను ఆహ్వానించడం చాలా గొప్ప విషయం అని సంతోషం వ్యక్తం చేశారు.
G7 సదస్సులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రధాని మోదీ తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అప్పుడే జో బైడెన్ అక్కడికి వచ్చారు. బైడెన్‌ని గమనించిన వెంటనే ప్రధాని మోదీ కుర్చీలో నుంచి లేచారు. మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు. అంతే కాదు. ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. క్వాడ్ సమ్మిట్‌కి ముందు ఈ ఇద్దరూ ఇంత స్నేహపూర్వకంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. జూన్ 21-24 మధ్యలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. హిరోషిమాలో ల్యాండ్ అయిన వెంటనే జపాన్ ప్రధాని కిషిద మోదీని సాదరంగా ఆహ్వానించారు. G-7 సదస్సుకి హాజరైన ఆయన..జపాన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాతావరణ మార్పులపైనా కీలక చర్చలు జరిపారు. త్వరలోనే G-20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహించనుంది. దీనిపైనా ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ఆ తరవాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతోనూ భేటీ అయ్యారు ప్రధాని మోదీ.