శ్రీనగర్‌లో ప్రధాని మోదీ పర్యటన, ఆర్టికల్ 370 రద్దు తరవాత కశ్మీర్‌కి తొలిసారి
PM Modi Srinagar Visit: ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్‌లో పర్యటించనున్నారు.
PM Modi Srinagar Visit: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తరవాత ప్రధాని జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన పర్యటిస్తుండడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది. 2019 తరవాత ఆయన ఇక్కడ భారీ ర్యాలీ కూడా చేపట్టనున్నారు. బక్షీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. వేలాది మంది పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. శ్రీనగర్ అంతా భద్రతా వలయంలో ఉంది. సభకి ప్రజల్ని తరలించేందుకు 1,100 మేర బస్సులు సిద్ధం చేశారు. శ్రీనగర్‌లోని ఓ స్కూల్ తరపున 100 బస్‌లు అందజేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కావడం వల్ల ఈ ర్యాలీని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. ముందు నుంచి హైకమాండ్ ఒకటే విషయం చెబుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి....ఆ నిర్ణయానికి ఫలితంగా కచ్చితంగా తాము 370 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సభకి కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి ఎజెండాతో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
"జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడి యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అవినీతి, లంచగొండితనం అంతా అంతమైపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెబుతారో అని ఆసక్తిగా వినడానికి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కనీసం 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం"
- తరుణ్ చుగ్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ
జమ్ములోని రకరకాల జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. వాళ్లు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. అన్ని చోట్లా భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి. పాస్‌లు ఉంటేనే కొంతమందిని అనుమతిస్తున్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా కొన్ని స్కూల్స్‌లో పరీక్షల్ని పోస్ట్‌పోన్ చేశారు.