PM Modi: మోదీజీ మీరు రోజూ టీవీలో కనిపిస్తారుగా - ఎంపీ కూతురి సమాధానానికి ప్రధాని నవ్వులు
PM Modi: భాజపా ఎంపీ అనిల్ ఫిరోజియా కూతురు, ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణలు నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నాయి.
PM Modi:
మీరు లోక్‌సభలో పని చేస్తారు కదా..
ప్రధాని మోదీ, ఓ చిన్నారి మధ్య జరిగిన సంభాషణలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ అనిల్ ఫిరోజియా, తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో ఎంపీ కూతురు ప్రధానితో కాసేపు ముచ్చటించింది. ఈ ఐదేళ్ల చిన్నారి మాటలకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. అహనా ఫిరోజియాను ప్రధాని మోదీ ఓ ప్రశ్న అడిగారు. "నేనెవరో తెలుసా" అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. అందుకు ఆ చిన్నారి "హా తెలుసు మోదీజీ. మీరు రోజూ టీవీలో కనిపిస్తారుగా" అని సమాధానమిచ్చింది చిన్నారి. ఈ ఆన్సర్‌తో షాకైన మోదీ మరో ప్రశ్న అడిగారు. "నేనేం చేస్తానో తెలుసా" అని ప్రశ్నించారు. అందుకు ఆ చిన్నారి "మీరు లోక్‌సభలో పని చేస్తారు కదా" అని సమాధానం చెప్పగానే ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. ఈ సమాధానాలు ప్రధాని మోదీకి ఎంతో నచ్చాయి. వెంటనే ఓ చాక్లెట్ తీసి చిన్నారికి అందించారు.
గడ్కరీ ఛాలెంజ్, స్వీకరించిన అనిల్ ఫిరోజియా
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా ఊబకాయులు. 127 కిలోలు ఉండే వారు. ఫిబ్రవరిలో ఈ నియోజకవర్గంలోని మాల్వాలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అనిల్ ఫిరోజియాను చూసి షాక్ అయ్యారట. ఇంత బరువుంటే ఆరోగ్యానికి మంచిది కాదని, వెంటనే బరువు తగ్గాలని సూచించారట. అప్పుడే ఎంపీ అనిల్ ఫిరోజియా తమ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలని నితిన్ గడ్కరీని అడిగారట. నిజానికి అప్పటికే చాలా సందర్భాల్లో నిధుల విషయమై గడ్కరీతో చర్చించారు అనిల్ ఫిరోజ్. అయితే నితిన్ గడ్కరీ మాత్రం ఈ సమస్య పరిష్కారానికి తెలివైన మార్గం వెతికారు. చాలా సేపు ఆలోచించి ఓ ఐడియాతో ముందుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అందించాలంటే ముందు మీరు బరువు తగ్గాలి అని ఎంపీ అనిల్ ఫిరోజ్‌కి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి బరువు తగ్గితే వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తానూ గతంలో 137 కిలోల బరువు ఉండేవాడినని,ఎంతో కష్టపడి 93 కేజీలకు తగ్గానని వివరించారు గడ్కరీ. ఎన్ని కిలోల బరువు తగ్గినా...కిలోకి రూ. 1000కోట్ల చొప్పున నిధులు అందిస్తామని ఎంపీ అనిల్ ఫిరోజ్‌కి చెప్పారు. ఇక అప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు అనిల్. వర్కౌట్లు, యోగా, స్విమ్మింగ్ ఇలా ఒక్కటేంటి, అన్ని వ్యాయామాలూ చేసి మూడు నెలల్లో 15 కిలోలు తగ్గారు.