Pegasus Spyware Row: మరోసారి చెలరేగిన పెగాసస్ దుమారం.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు
పెగాసస్ వ్యవహారం మరోసారి సుప్రీం కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
పెగాసస్ స్పైవేర్‌పై మరోసారి దుమారం చెలరేగింది. దీన్ని భారత్ 2017లోనే కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల సంచలన కథనం ప్రచురించడంతో మళ్లీ రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఈ పెగాసస్ వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
భారత్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై దర్యాప్తునకు పిటిషనర్ ఎంఎల్ శర్మ డిమాండ్ చేశారు. ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. న్యూయార్క్ టైమ్స్ నివేదికను పిటిషన్‌లో పేర్కొన్నారు.
టైమ్స్ కథనం..
భారత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో భాగంగా ఇజ్రాయెల్‌ను నుంచి కొనుగోలు చేసిందని తాజాగా అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక ప్రకటించింది.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటనలో రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులోనే పెగాసస్ స్పైవేర్ కూడా ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని కానీ దాన్ని వినియోగించకూడదని నిర్ణయం తీసుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ స్పైవేర్‌కు సంబంధించిన పలు కీలకమైన విషయాలను న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
కమిటీ..
పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు నిర్వహింపచేస్తోంది. నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దేశంలో తీవ్ర దుమారం రేగింది. స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ విషయాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉండేందుకు చాలా మంది నిపుణులు ఆసక్తి చూపించలేదు. పెగాసస్‌తో 300 మందికి పైగా భారతీయులపై నిఘా పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ నిజం ఏమిటో ఇప్పటి వరకూ తేలలేదు.
Also Read: Mann Ki Baat: అవినీతి రహిత భారతావనే లక్ష్యం.. దానికి ఇదే మార్గం: మోదీ
Also Read: Manipur Election 2022: మణిపుర్‌లో భాజపా అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ స్థానం నుంచే సీఎం బరిలోకి