Paytm Crisis: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో త్వరలోనే లేఆఫ్‌లు! RBI ఆంక్షలతో అంతా గందరగోళం
Paytm Crisis: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ త్వరలోనే లేఆఫ్‌లు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Paytm Crisis News:పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ (Paytm Crisis) త్వరలోనే 20% మేర ఉద్యోగాల కోత విధించే అవకాశాలున్నాయి. RBI ఆంక్షలు విధించినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది పేటీఎమ్. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియక ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు Reuters వెల్లడించింది. మార్చి 15 తరవాత పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సర్వీస్‌లు కొనసాగించే అవకాశం లేకుండా RBI ఆంక్షలు విధించింది. అందుకే..ఆపరేషన్స్‌తో పాటు ఇతరత్రా విభాగాల్లోని ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో ఉన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్ నాటికి Paytm Payments Bank Limited లో 2,775 మంది ఉద్యోగులున్నారు. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Curbs on Paytm) ఆంక్షలు విధించిందో అప్పటి నుంచి స్టాక్‌మార్కెట్‌లోనూ పేటీఎమ్ దారుణంగా పతనమైంది. చాలా మంది ఇన్వెస్టర్‌లు పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకూ పేటీఎమ్ షేర్ వాల్యూ 50% మేర పడిపోయింది. ఇక మీదట ఇది మరింత పడిపోయే అవకాశమూ ఉంది.
"సరిగ్గా ఉద్యోగులకు అప్రైజల్స్ పడే సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. అందుకే తక్కువ రేటింగ్స్ ఉన్న ఉద్యోగులను తొలగించాలని పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లేఆఫ్‌లు ఉండవని కంపెనీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఉన్నట్టుండి తొలగిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు"
- పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి
అలాంటిదేమీ లేదు: పేటీఎమ్ ప్రతినిధి
నిజానికి ఫిబ్రవరిలోనే పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ అంతర్గతంగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. లేఆఫ్‌లు ఉండనే ఉండవని ఆ మీటింగ్‌లో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే...కొంత మంది పేటీఎమ్ ప్రతినిధులు మాత్రం లేఆఫ్‌లు ఉండవని మరో వాదన వినిపిస్తున్నారు.
"లేఆఫ్‌లు అనేవే లేవు. ఇప్పటికే అప్రైజల్స్‌పై చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగే పర్‌ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులకు హైక్‌లు ఉంటాయి. వాళ్ల రోల్‌కి తగ్గట్టుగా అవి అందిస్తారు"
- పేటీఎమ్ ప్రతినిధి
మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్స్, వ్యాలెట్స్ పని చేసినప్పటికీ కొత్తగా డిపాజిట్‌లు చేసుకోడానికి అవకాశముండదు. ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నా పేటీఎమ్ యాప్ మాత్రం పని చేయనుంది. ఈ మేరకు National Payments Corporation of India నుంచి కంపెనీ లైసెన్స్ కూడా తెచ్చుకుంది. అంటే ఎప్పటిలాగే అందరూ పేటీఎమ్ యాప్‌ని వినియోగించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే..లేఆఫ్‌ల విషయంలో మాత్రం పేటీఎమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. బ్యాంకింగ్ స్టాఫ్‌ని ఏం చేస్తారన్న స్పష్టతా ఇవ్వలేదు. దాదాపు వంద మంది బ్యాంక్ ఉద్యోగులను పేటీఎమ్ తమ విభాగానికి బదిలీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి కొరతే లేదు, అందరికీ నీళ్లు అందుతాయ్ - డీకే శివకుమార్