Patancheru MLA: సీఎం రేవంత్‌ను కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ
Gudem Mahipal Reddy: ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాను కూడా అలానే కలిశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
Patancheru MLA Gudem Mahipal Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యానని అన్నారు. తన భేటీపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని ఎమ్మెల్యే కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాను కూడా అలానే కలిశానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోకసభ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి గారు (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి గారు (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి గారు (పఠాన్ చెరు), మాణిక్ రావు గారు (జహీరాబాద్). pic.twitter.com/fn2X9gkczI
— Telangana Congress (@INCTelangana) January 23, 2024