pegasus supreme court : విచారణ కాదు పరిశీలన.. పెగాసస్‌పై సుప్రీంకు తెలిపిన కేంద్రం
పెగాసస్ నిఘా వ్యవహారంలో నిపుణులతో పరిశీలన చేయిస్తామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రకటించింది.
పెగాసస్‌పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించకుండా కేంద్ర ప్రభుత్వం మధ్యే మార్గాన్ని కనిపెట్టింది. పెగాసస్ నిఘా విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన నిఘా ఆరోపణలకు ఒక్కటంటే ఒక్క ఆధారం లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నామని.. మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇవన్నీ కుట్ర పూరితంగా చేసిన ప్రచారాలని.. అందుకే ఆ అంశంపై ఉన్న అనుమానాలన్నింటినీ తొలగించేందుకు నిపుణుల కమిటీన ఏర్పాటు చేస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
పెగాసస్ నిఘా వ్యవహారం బయటపడిన తర్వాత రాజకీయ దుమారం రేగింది. విచారణ కోసం విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు కూడా అదే కోరుతున్నాయి. పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాయి. కేంద్రం మాత్రం పెగాసస్ పై విచారణకు అంగీకరించడం లేదు. దేశ సమగ్రతకు భంగం కలిగించే నిఘా ఎవరు పెట్టారో తేల్చాలని నిందితులకు శిక్షలు పడాలని.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. "పెగాసస్" సాఫ్ట్‌వేర్ సాయంతో దేశంలో కనీసం మూడు వందల మంది ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. వ్యక్తిగత స్వేచ్చపై దాడి వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనన్న డిమాండ్లు విపక్ష పార్టీలు చేశాయి. ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థలు కూడా.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరాయి.
ప్రముఖ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది. గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీలైనంత వరకూ ఈ "పెగాసస్" వ్యవహారాన్ని తక్కువ చర్చకు పరిమితం చేయాలనుకుంటోంది. దర్యాప్తు అనే మాట వినడానికి కూడా సిద్ధపడ లేదు. "పెగాసస్" వ్యవహారంపై అందరి వేళ్లూ.. కేంద్రం వైపునే చూపిస్తున్నాయి. దీంతో నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంపైనే పడింది. తప్పించుకుంటే.. కేంద్రంపై మరిన్ని అనుమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టులో .. మధ్యే మార్గంలో విచారణ కాకండా పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా విపక్ష పార్టీలు మాత్రం విచారణకు పట్టు బట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బయటకు చెబుతున్న అంశాల కన్నా.. అనేకం దాచి పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. కేంద్రం విచారణ చేయించకుండా పరిశీలనతో సరి పెడితే.. విమర్శలు అలాగే ఉంటాయి.