Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు మీరే సమాధానం చెప్పండి - పాకిస్తాన్ ఆర్మీకి సలహా ఇచ్చిన పాక్ ప్రధాని
Pakistan PM : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీప్.. పాకిస్తాన్ మిలటరీకి ప్రత్యేక సూచనలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మీరే సమాధానం ఇవ్వాలని సూచించారు.

Pakistan PM Shehbaz Sharif: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ఎలా స్పందించాలో తెలియక పాకిస్తాన్ సతమతమవుతోంది. ఉగ్రవాద క్యాంపులపైన దాడులు జరగడంతో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు, వారి కుటంబసభ్యు లు చనిపోయారు. దీంతో భారత్ పై ఎలాంటి దాడులు చేయాలన్నదానిపై పాకిస్తాన్ ప్రధాని తేల్చుకోలేకపోతున్నారు. ఓ వైపు యుద్ధం వస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా ఆయన పై ఒత్తిడి పెరిగిపోవడంతో చివరికి భారత దాడులకు ప్రతిస్పందించే అధికారం పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మీరే ఏదో ఒకటి చేయాలని పాక్ ఆర్మీని కోరిన ప్రధాని షరీఫ్
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారతదేశం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం తన సైనిక దళాలను కోరింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు , దాని నియంత్రణలో ఉన్న కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనకు భారతదేశం ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి. పహల్గామ్ దాడి జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత భారత్ ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది, ముఖ్యంగా పాకిస్తాన్ సైనిక స్థావరాలను తప్పించింది, మరింత సైనిక సంఘర్షణను రేకెత్తించకుండా ఉగ్రవాద శిబిరాలనే భారతదేశం కూల్చేసింది.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్ ఆర్మీ వల్లనే..
పాకిస్తాన్ ఆర్మీ మాత్రం భారత్ పై ఎటాక్ చేయాలని ఉబలాటపడుతోంది. భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయలేదని.. పౌరుల నివాసాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తమనుతాము రక్షించుకునే హక్కు ఉందని.. అవసరమైతే ఏదైనా ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యేందుకు సాయుధ దళాలకు ఇప్పటికే అధికారం ఇచ్చింది. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేక వైఖరి కారణంగా ఆర్మీకి ఈ అధికారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఒక భారతీయ దౌత్యవేత్తను పిలిచి, అధికారిక నిరసన నోట్‌ను అందజేసింది. సమాచార మంత్రి అతుల్లా తరార్ భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే పాకిస్తాన్ హక్కు ఉందని చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రతిస్పందించే సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని ఆయన భారతదేశాన్ని హెచ్చరించారు.
భారత్ పై ఎలాంటి చర్యలు తీసుకున్న పాకిస్తాన్‌కు కష్టమే.. !
ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ వల్లనే జరుగుతోంది. పాక్ ఆర్మీ జనరల్ మునీర్ చేసిన కుట్ర కారణంగానే ఇదంతా జరుగుతోందని పాకిస్తాన్ లోనూ అనుమానాలున్నాయి. ఇప్పుడు పాకిస్తన్ ఆర్మీకి ప్రభుత్వం అనుమతి అనేది ఓ ప్రోటోకాల్ అని.. ఒక వేళ అనుమతి ఇవ్వకపోయినా ఆర్మీ తాను చేయాలనుకున్నది చేస్తుందని అంటున్నారు. పాకిస్తాన్ సరిహద్దులు ఇవతలకు వచ్చి ఏ చర్యలు తీసుకోవాలన్నా.. భారత విమానాలు రెడీగా ఉంటాయి. అవి తిరిగి వెళ్లడం కష్టం అనుకోవచ్చు.





















