Divyabharathi: దర్శకుడి నీచమైన కామెంట్స్‌పై హీరోయిన్ ఆగ్రహం... వివాదంలో సుడిగాలి సుధీర్ సినిమా!
Sudigali Sudheer's Goat Controversy: సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందుతున్న సినిమా 'గోట్'. దర్శకుడు తనను చిలకా అనడం పట్ల హీరోయిన్ దివ్యభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాల్లో 'గోట్' (GOAT Telugu Movie) ఒకటి. చాలా రోజులుగా నిర్మాణంలో ఉందీ సినిమా. ఈ పేరుతో దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీసిన 'గోట్' విడుదలైంది కూడా. ఇక సుధీర్ సినిమాకు వస్తే... దర్శకుడు నరేష్ కుప్పిలి తనపై చేసిన కామెంట్స్ పట్ల హీరోయిన్ దివ్యభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
చిలకా అనడం ఏమిటి? అదేం జోక్ కాదు!
'గోట్' షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకని ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 'ఒడియమ్మా' సాంగ్ లిరికల్ వీడియో ఈ రోజు (నవంబర్ 19న) రిలీజ్ చేయనున్నారు. ముందుగా సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో వచ్చాక దర్శకుడు నరేష్ కుప్పిలి 'ఎక్స్'లో దివ్యభారతిని హేళన చేస్తూ నీచమైన కామెంట్స్ చేశారు.
''ఏం లేబర్ రా నువ్వు? ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావ్. అసలు సెకండ్ లీడ్ యాక్ట్రెస్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావ్. పోనీ మంచి ట్యూన్ ని ఏం చేశావ్ రా'' అని నరేష్ కుప్పిలి ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు దివ్యభారతి తీవ్రంగా ఖండించారు.
Also Read: హనుమంతుడిని అవమానించలేదు... రాజమౌళికి 'హైపర్' ఆది సపోర్ట్... హీరోలనూ వదల్లేదుగా!
''మహిళను చిలకా లేదా మరొక పదంతో పిలవడం జోక్ కాదు. స్త్రీలపై ద్వేషం వ్యక్తం చేయడమే. ఇప్పుడు కాదు... చిత్రీకరణ చేసేటప్పుడు సెట్స్‌లోనూ ఈ దర్శకుడి తీరు ఇంతే. మహిళలను కించపరిచేలా మాట్లాడేవాడు'' అని దివ్యభారతి పేర్కొన్నారు.
సుధీర్ మౌనంగా ఉండటం డిజప్పాయింట్ చేసింది!
'గోట్' చిత్రీకరణలో దర్శకుడు నరేష్ కుప్పిలి కామెంట్స్ చేస్తున్నప్పుడు హీరో సుడిగాలి సుధీర్ మౌనంగా ఉండటం తనను డిజప్పాయింట్ చేసిందని దివ్యభారతి వివరించారు. హీరో మౌనంగా ఉండటం వల్ల ఇటువంటి నీచమైన సంస్కృతి మరొక రోజు కంటిన్యూ అవుతుందని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. హేళన చేయడానికి మహిళలు టార్గెట్ కాకూడదని ఆవిడ వివరించారు.
Also Read: నయనతారకు భర్త సర్‌ప్రైజ్... బర్త్ డే గిఫ్ట్ అదిరింది విఘ్నేషూ - ఆ కారు రేటెంతో తెలుసా!?
తమిళంలో తాను పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు, చిత్ర బృందాలతో కలిసి మళ్ళీ మళ్ళీ పని చేశానని దివ్యభారతి చెప్పారు. అందరితో తనకు ఇష్యూలు లేవని, 'గోట్' దర్శకుడు ఒక్కడితో తనకు సమస్య తలెత్తిందని ఆవిడ తెలిపారు. నరేష్ కుప్పిలి గీత దాటి ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇప్పుడు పబ్లిగ్గా సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ చేస్తున్నారని, దీనిపై స్పందించే హక్కు తనకు ఉందని, ఒకవేళ స్పందించకపోతే తనకు నిద్ర పట్టదన్నారు. ఈ వివాదంలో దర్శకుడికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే... వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నానని దివ్యభారతి అన్నారు. మరి ఈ వివాదం పట్ల సుధీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అన్నట్టు... లిరికల్ వీడియోలో దర్శకుడికి క్రెడిట్స్ ఇవ్వలేదు.





















