Ola Electric Employee: ఇంకోసారి కుక్క బతుకు అనొద్దు - ఓలా కంపెనీలో కుక్కకు ఉద్యోగం, ఐడీ కార్డు
Dog as Ola Electric Employee: ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ఉద్యోగి జాయిన్ అయ్యింది. దాని పేరు బిజిలి. గత ఆదివారం బిజిలికి సంబంధించిన అధికారిక ఐడీ కార్డు, వివరాలను భవిష్ అగర్వాల్ చేశారు.
Dog as Ola Electric Employee: మనం సాధారణంగా వినే మాట ‘కుక్క బతుకు’. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ దొరికినది తింటూ ఉంటుంది. అందుకే ఎవరినైనా తిట్టాలంటే నీది ఓ బతుకేనా.. కుక్క బతుకు అంటుంటారు. మీరు ఇది చదివితే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఒక కుక్క ఇప్పుడు ఓలా కంపెనీలో ఉద్యోగి. దానికి ఐడీ కార్డు ఉంది. ఎంప్లాయ్ కోడ్, చిరునామా ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ కుక్కకు ఇచ్చిన సదుపాయం, వసతులు.
ఓలా కంపెనీకి, కుక్కలకు మధ్య మంచి బంధమే ఉంది. ఓ సారి ఓలా ఆఫీస్‌లో కుర్చీలో శునకాలు సేదతీరుతున్న వీడియో, ఫొటో చేశారు ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్. అంతకు ముందు సంస్థలో డాగ్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతటితో అయిపోలేదు. తాజాగా ఓ కుక్కకు ఏకంగా ఉద్యోగం ఇచ్చేశారు. దాని పేరుతో ఐడీ కార్డు కూడా తయారు చేయించారు. దీనికి సంబంధించిన వివరాలను ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా X(ట్విటర్)లో షేర్ చేశారు.
ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ఉద్యోగి జాయిన్ అయ్యింది. దాని పేరు బిజిలి. ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే Electricity అని వస్తుంది. గత ఆదివారం బిజిలికి సంబంధించిన అధికారిక ఐడీ కార్డు, వివరాలను భవిష్ అగర్వాల్ చేశారు. ఐడీ కార్డ్ ప్రకారం బిజిలీ ఎంప్లాయ్ కోడ్ '440 V'. ఇది వోల్టేజ్‌ను సూచిస్తుంది. అంతే కాదు బిజిలీ బ్లడ్ గ్రూప్ 'పావ్+వే' అని కార్డులో రాయించారు. సంస్థలోని ఉద్యోగులు సంస్థలో అంతర్గత సమాచార మార్పిడికి ఉయోగించే స్లాక్ ద్వారా కుక్కను సంప్రదించవచ్చు. అంతే కాదు బిజిలీ ఎమెర్జెన్సీ కాంటాక్ట్ BA కార్యాలయంగా ముద్రించారు. బిజిలీ ఎక్కడ పనిచేస్తుందో తెలిపేలా చిరునామా హోసూర్ రోడ్‌లోని ఓలా ఎలక్ట్రిక్ కార్యాలయంగా కార్డులో పేర్కొన్నారు.
New colleague now officially! pic.twitter.com/dFtGMsOFVX
— Bhavish Aggarwal (@bhash) July 30, 2023
దీంతో ట్విటర్‌లో బిజిలీకి ఫాన్స్ పెరిగిపోయారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిజిలీని కలుసుకున్నందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లు, షేర్, ట్యాగుల రూపంలో తమ ఉత్సాహం, ప్రేమను పంచుకున్నారు. ఓ నెటిజన్ బిజిలీ తనకు పేరు నచ్చిందని, యానిమేటెడ్ కుక్కల సినిమాలో పాత్రను సూచిస్తూ ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘ఇది బిజిలీ ప్రపంచం, మనమందరం దానిలో జీవిస్తున్నాం’ అని చమత్కరించాడు. ఇంకో నెటిజన్ అయితే “అద్భుతం పావ్‌సమ్!” అంటూ తమ భావాలను షేర్ చేసుకున్నారు. మరి కొందరు తమ కుక్కలకు సైతం ఇలాంటి ఉద్యోగం కావాలని షేర్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం బిజిలీ ఐటీఆర్ దాఖలు చేసిందా లేదా అంటూ జోకులు పేలుస్తున్నారు.
మరి కొందరు అయితే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘ఈ కొత్త ఉద్యోగి అయినా క్రమశిక్షణతో పని చేయాలని భావిస్తున్నామని, వినియోగదారుల కంప్లైంట్లకు స్పందించాలని ఫైర్ అవుతున్నారు. వినియోగదారుల సమస్యలు పట్టించుకోకుండా నిద్రిస్తున్న ఉద్యోగులను నిద్ర లేపాలంటూ సటైర్లు విసురుతున్నారు. కుక్కలకు ఇస్తున్న విలువ వినియోగదారులకు లేదంటూ, ఇకనైనా సంస్థ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. కుక్కలతో సమానమైన ఓలా ఉద్యోగులకు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కష్టమర్ల సమస్యలు పరిష్కరించడానికి సమయం కేటాయించలేని ఉద్యోగులు ఇలాంటి పనికిమాలిన వాటిని షేర్ చేయడంలో ముందుంటారని మండిపడుతున్నారు.
భవిష్ అగర్వాల్ తన కార్యాలయంలో కుక్కలపై పోస్ట్‌లను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓలా ఆఫీసులో సోఫాలపై నిద్రిస్తున్న మూడు కుక్కల ఫొటో షేర్ చేశారు. పెంపుడు జంతువులకు అనుకూలమైన పని వాతావరణం కోసం ఓలాను వినియోగదారులు ప్రశంసించారు. గతేడాది ఆఫీసులో కుక్కతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. "సమావేశాలు చేయడానికి ఉత్తమ మార్గం" అంటూ క్యాప్సన్ పెట్టారు.