Nupur Sharma Death Threat: నుపుర్ శర్మ హత్యకు పాకిస్థాన్ సంస్థ కుట్ర? అలా చంపాలని ప్లానింగ్
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి ఓ టెర్రరిస్ట్ గుజరాత్‌కు వచ్చాడు.
ఇలా ప్లాన్ చేశారట..
మహమ్మద్ ప్రవక్త నుపుర్ శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ టెర్రరిస్ట్ ఆమెను చంపేందుకే అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడని రాజస్థాన్ పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్‌లోని తెహ్‌రీక్ ఏ లబ్బైక్ సంస్థ ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధరించారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తి పేరు రిజ్వాన్‌గా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా వచ్చి ఆమెను హత్య చేయాలని చూశారని రాజస్థాన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ సెంగతిర్ వెల్లడించారు. సీఐడీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇంటిలిజెన్స్ బ్యూరో రిజ్వాన్‌ను విచారిస్తున్నట్టు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవటానికి తెహ్‌రీక్ సంస్థే కారణమని, చాలా మంది ప్రజల ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌లో రిజ్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలిజెన్స్ బ్యూరోతో పాటు ఇతర ఏజెన్సీలు అతడిని ఇంటరాగేట్ చేస్తున్నారు.
విచారణ కొనసాగుతోంది..
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...జులై 16వ తేదీన హిందుమల్‌కోట ఔట్‌పోస్ట్ వద్ద రిజ్వాన్‌ను అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని చూసిన పాట్రోలింగ్ టీమ్...అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి బ్యాగ్‌లో 11 ఇంచుల కత్తి, మతగ్రంథాలు,బట్టలు, ఆహారంతో పాటు ఇసుకను గుర్తించారు పోలీసులు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మండి బహౌద్దీన్ సిటీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను తట్టుకోలేక, ఆమెను హత్య చేసేందుకే వచ్చానని రిజ్వాన్ అంగీకరించాడు. ఈ ప్లాన్ అమలు చేసే ముందు అజ్మర్ దర్గాకు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. 8 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఈ టెర్రరిస్ట్‌ను కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతానికి నిఘా సంస్థలు అతడి నుంచి మరికొంత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.
బిహార్‌లో దారుణ హత్య..
ఇప్పటికీ నుపుర్ శర్మ వ్యాఖ్యలపై దేశంలో ఏదో ఓ చోట దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వీడియో చూసిన వ్యక్తిని ఇటీవల బిహార్‌లో కత్తితో పొడిచారు దుండగులు. సీతామర్హిలో ఈ ఘటన జరిగింది. సీతామర్హి జిల్లాలో నుపుర్ శర్మ వీడియోను చూసినందుకు అంకిత్ ఝా అనే యువకుడిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచారు. అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన దాడికి వ్యక్తిగత శత్రుత్వమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసినా అందులో నుపుర్ శర్మ ప్రస్తావన లేదు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.