NTR Birth Anniversary: 28న విడుదల కానున్న ఎన్టీఆర్ ముఖచిత్రంతో ఉన్న రూ. 100 నాణెం- ఫ్యామిలీకి సమాచారం పంపిన కేంద్రం
NTR Birth Anniversary: నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆర్బీఐ ఆయన ఫొటోతో ప్రత్యేకంగా వంద రూపాయల నాణెం ముద్రించింది.
NTR Birth Anniversary: నందమూరి తారక రామారావు. తెలుగు వారు గర్వించే మహా నటుడు. ప్రజారంజక పాలన అందించిన రాజకీయనాయకుడు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నట సార్వభౌముడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేక నాణెం రూపొందించింది. కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో రూ.100 నాణెం అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈనెల 28వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. రాష్ట్రపతి భవన్ సూచనలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు పురుందేశ్వరి వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపారు.
మే 28వ తేదీన.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao Birth Anniversary) జయంతి. ఆ రోజు తెలుగు ప్రజలు అందరూ ఆయన్ను స్మరించుకునే రోజు. 1923లో ఆయన జన్మించారు. ఈ ఏడాది మే 23కు ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టి వందేళ్లు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మే 28వ తేదీ ఉదయం నిమ్మకూరులో ప్రారంభమైన శత జయంతి వేడుకలు, ఆ రోజు మధ్యాహ్నం గుంటూరులోనూ, సాయంత్రం తెనాలిలోనూ జరిగాయి. ఆ తర్వాత ఈ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వాటిని సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు భారీగా హాజరు కాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.