Nitin Gadkari: గడ్కరీ ఏంటి ఇంత మాట అనేశారు? కేంద్రంపై ఎందుకింత అసహనం?
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవటం లేదని అన్నారు.
Nitin Gadkari on BJP's Top Body:
సమయానికి నిర్ణయాలు తీసుకోవటం లేదు: గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...మోదీ సారథ్యంలోని ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం లేదని అన్నారు.
"అనుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు. ఆ సామర్థ్యం కూడా మనకుంది. భవిష్యత్‌లో భారత్‌లోని మౌలిక వసతులు మెరుగవ్వాలనేదే నా ఆకాంక్ష. మెరుగైన టెక్నాలజీని, ఆవిష్కరణలను మనం యాక్సెప్ట్ చేయాలి. వాటిపై అధ్యయనం చేయాలి. నాణ్యతలో రాజీ పడకుండానే... మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలి. ధరలు తగ్గించే ప్రయత్నాలు చేయాలి. నిర్మాణ రంగంలో సమయమే అత్యంత కీలకం. సమయమే పెట్టుబడి. కానీ...మన ప్రభుత్వంతో వచ్చిన సమస్యేంటంటే...సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవటం లేదు" అని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
టెక్నాలజీ, రీసోరెస్స్ కన్నా సమయం ఎంతో విలువైందని అభిప్రాయపడ్డారు. ముంబయిలో జరిగిన NATCON ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంటరీ బోర్డ్ నుంచి నితిన్ గడ్కరీ నుంచి అధిష్ఠానం తప్పించిన తరవాత..ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్‌గా మారింది. గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కూడా పార్లమెంటరీ బోర్డ్ నుంచి తొలగించింది భాజప నాయకత్వం. వారి స్థానంలో ఆరుగురు కొత్త వారిని తీసుకుంది. మాజీ భాజపా అధ్యక్షుడైన నితిన్ గడ్కరీని బోర్డ్ నుంచి తొలగించటం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. భాజపా నేతలే ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇంతే..
ఇప్పుడే కాదు. వారం రోజుల క్రితం కూడా గడ్కరీ కేంద్రంపై ఇలాంటి కామెంట్సే చేశారు. నాగ్‌పూర్‌లోని లక్ష్మణ్ రావ్ మన్‌కర్ స్మృతి సంస్థ ఇన్‌స్టిట్యూషన్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయన..అటల్ బిహార్ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్లు చేసిన కృషి వల్లే భాజపా ఇలా నిలదొక్కుకుందని అన్నారు. 1980లో ముంబయి వేదికగా వాజ్‌పేయీ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "చీకటి తొలగిపోతుంది. సూర్యుడు వస్తాడు. ఓ రోజు తప్పకుండా కమలం వికసిస్తుంది" అన్న వాజ్‌పేయీ మాటల్ని ప్రస్తావించారు గడ్కరీ. వాళ్లు ఎంతో శ్రమించటం వల్లే మోదీ నేతృత్వంలో భాజపా ఇలా అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ తమ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను పునర్‌వ్యవస్థీకరించింది. కొంత మంది సీనియర్లను తొలగించి కొత్త వారికి చాన్సిచ్చింది. బీజేపీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఈ బోర్డులో మొత్తం పదకొండు మందికి చోటు కల్పించారు. వీరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్‌తో పాటు హోంమంత్రి అమిత్ షా ఉన్నారు.
తెలంగాణ నుంచి ఇటీవలే రాజ్యసభ సీటు పొందిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి పదవుల నుంచి తప్పించిన యడ్యూరప్ప, షర్బానంద సోనోవాల్ వంటి నేతలకు చోటిచ్చారు. ఇక్బాల్ సింగ్ లాలాపురి,శ్రీమతి సుధాయాదవ్, సత్యనారాయణ జతియా, బీ.ఎల్.సంతోష్‌లు మిగిలిన సభ్యులు. ఈ బోర్డుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహిస్తారు. అయితే అత్యున్నత కమిటీ నుండి నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నేతల్ని తొలగించడం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది. ఎప్పటికప్పుడు కొంత మంది సీనియర్లను పక్కన పెడుతూ ఉంటారు.
Also Read: పాదయాత్రకు అనుమతి ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
Also Read: Amitabh Bachchan Covid 19: మరోసారి కరోనా పాజిటివ్.. బిగ్ బీ ఏమన్నారంటే?