Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు, చెన్నైలో NIA సోదాలు
Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుడు కేసులో అనుమానితులు చెన్నైలో ఉన్నారన్న సమాచారం మేరకు NIA సోదాలు చేపట్టింది.
Bengaluru Cafe Blast Case: బెంగళూరు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైలో NIA పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మూడు చోట్ల ఈ సోదాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మార్చి 1వ తేదీన జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులు చెన్నైలోనే దాక్కున్నట్టు నిఘా వర్గాల సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా అక్కడ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారిని గుర్తించిన NIA ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తోంది. క్యాప్, మాస్క్ పెట్టుకుని కనిపించిన నిందితుడి ఫొటోలు, వీడియోలను ఇప్పటికే విడుదల చేసింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని ప్రజల్ని కోరింది. జాడ చెప్పిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామి ప్రకటించింది. మార్చి 23వ తేదీన నిందితుడిని గుర్తించారు NIA అధికారులు. ముసావిర్ హుసేన్ షజీబ్ కేఫ్‌లో బాంబు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. ముసావిర్ కర్ణాటకలోని శివమొగ్గలోనే ఉన్నట్టు గుర్తించారు. అయితే..శివమొగ్గలో ఐసిస్ యూనిట్ ఉందని, హుసేన్ ఈ యూనిట్ తరపున పని చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి వెనకాల ఐసిస్ ఉండొచ్చని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. విచారణ కొనసాగుతోందని..త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. పోలీసులు కూడా NIAకి సహకరిస్తున్నట్టు వెల్లడించింది.
"ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. దాదాపు ఇది తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఓ అనుమానితుడిని NIA గుర్తించింది. ఈ దాడికి పాల్పడింది ఆ వ్యక్తే అన్నది ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఆ నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. NIA ప్రస్తుతం అదే పనిలో ఉంది. వాళ్లకి కీలకమైన ఆధారాలు దొరికాయి"
- జి. పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి