NIA Raids: తెలుగు రాష్ట్రాలపై ఎన్‌ఐఏ గురి- అడ్వకేట్లు, సామాజికవేత్తలు, టీచర్స్ ఇళ్లల్లో తనిఖీలు
NIA Raids:తెలుగు రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల సంఘ నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల సంఘ నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ఈ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలో ఏ కాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని అమరుల బంధు మిత్రులు సంఘం కార్యకర్త ఇంట్లో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు ఏపీలో మరో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భవాని, అడ్వకేట్ సురేష్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఆల్వాల్‌లోని సుభాష్ నగర్‌లో వీరి బంధువులు, స్నేహితులు, ఇళ్లపై కూడా ఎన్‌ఐఏ దాడులు చేసింది. ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది.
నెల్లూరు జిల్లా ఉస్మాన్ సాహెబ్ పేట ఉంటున్న పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు, న్యాయవాది క్రాంతి చైతన్యతోపాటు హక్కుల ఉద్యమంలో ప్రజా గొంతుకను వినిపిస్తున్న పలువురు నాయకుల నివాసాలలో NIA సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటలనుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎల్లంకి వెంకటేశ్వర్లు రెండు దశాబ్దాలు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు.
నెల్లూరు ఫతేఖాన్ పేటలో చైతన్య మహిళా సంఘం నేతలు అన్నపూర్ణ, అనూష నివాసాల్లో కూడా NIA సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. NIA అధికారులు, సిబ్బంది వారి నివాసాల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. చీమకుర్తిలో దుడ్డు వెంకటరావు ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు. సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు ఇంట్లో, రాజమండ్రి బొమ్మెరులో పౌర హక్కుల నేత నాజర్ ఇంట్లో దాడులు జరుగుతున్నాయి. హార్లిక్స్ ప్యాక్టరీలో ఉద్యోగి కోనాల లాజర్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీకాకుళం లో కెఎన్.పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు.
తిరుపతిలో క్రాంతి చైతన్య ఇంట్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. గుంటూరులో పొన్నూరులో డాక్టర్ రాజారావుని విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. వీళ్లంతా మావోయిస్టు సానుభూతిపరులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ పూర్ణనందం పేటలో అడ్వకేట్ టి ఆంజనేయులు ఇంట్లో ముగ్గురు సభ్యుల ఎన్‌ఐఏ టీమ్ సోదాలు చేపట్టింది.
అనంతపురంలో ఎన్ఐఏ అధికారుల సోదాల కలకలం రేపాయి. బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. శింగనమల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరాములు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ప్రజా చైతన్య ఉద్యమాలు కోసం ఎరికుల శ్రీరాములు పలు రచనలు చేశారు. శ్రీరాములు ఇంట్లో నుంచి ఎవరిని బయటికి రానివ్వకుండా సోదాలు చేస్తున్నారు. కాలనీని పూర్తిగా అప్రమత్తం చేసి సోదాలు చేపట్టారు.
వరంగల్‌లోనూ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పెడిపల్లి, హంటర్ రోడ్డులోని చైతన్య మహిళా మండలి సభ్యులు అనితా, శాంతమ్మ ఇళ్లలో తనిఖీలు సాగుతున్నాయి.
జూలై 24న మణిపూర్ ఘటనపై పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా ఆందోళన చేపట్టడమే NIA దాడులకు కారణం అని ఆరోపిస్తున్నారు KNPS నాయకులు. ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టిన KNPS రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ను జులైలో అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జైలుకి తరలించారు. ఇవాళ రెండు రాష్ట్రాల్లో KNPS, పౌర హక్కుల సంఘం, చైతన్య మహిళ సంఘాల రాష్ట్ర నాయకులపై దాడులు కొనసాగిస్తున్నారని సమాచారం. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నెపంతో దాడులు చేస్తున్నారని KNPS రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ఆరోపించారు.