NGT Fire on AP Govt : పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టులా..? మరోసారి ఎన్జీటీ ఆగ్రహం..!
పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పోలవరం ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్మించడంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వమే ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఏపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసింది. పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీవలో విచారణ జరిగింది. గతంలోనే వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి లోపించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పట్టిసీమ, పురుషోత్తమట్నంలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషన్లు..!
పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు విషయంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేళ్ల నుంచి అక్కడ ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కేసు ముగించాలన్న ఆత్రుతలోనే ఉంది కనీ పర్యావరణంపై పట్టింపు లేదని మండిపడింది. పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించింది. ఉత్తరాంధ్రకు...విశాఖకు మంచినీటిని తరలించేందుకు పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వమే నిర్మించింది.
ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గండం..!
ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని... జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకూ ఇదే తరహా ఎన్జీటీ చిక్కులు వచ్చాయి. ఈ అంశంపై చెన్నై బెంచ్‌లో ప్రస్తుతం పిటిషన్లు ఉన్నాయి. సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ సహకరించకపోతూండటంతో పరిశీలన జరగడం లేదు.
చర్యలు తీసుకుంటామన్న ఎన్జీటీ..!
ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే... ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎన్జీటీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల భవితవ్యం.. బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.