Krishna Water Share Row : 50-50 కావాలంటున్న తెలంగాణ..కాదు 30-70 అంటున్న ఏపీ..! 27న లెక్క తేలుతుందా..?
కృష్ణా జలాల్లో చెరిసగం వాటా పంచేలా పట్టుబట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఒప్పందాల ప్రకారం 70శాతం ఏపీకే కేటాయించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. 27న కేఆర్ఎంబీ భేటీలో దీనిపై చర్చించనున్నారు.
కృష్ణా జలాల్లో వాటా కోసం తెలుగు రాష్ట్రాలు మరోసారి వాదనకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకపక్షంగా కృష్ణా, గోదావరి రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డుల్ని కేంద్రం నోటిఫై చేయడంపై అసంతృప్తిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక నుంచి హాజరు కాకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న ఆందోళన చెందారేమో కానీ ఇక బోర్డుల భేటీకి హాజరవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకంగా అధికారులతో ఈ అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నదీజలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని దిశానిర్దేశం చేశారు.
27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరుగనుంది. గతంలోలా ఇప్పుడు తెలంగాణ అభ్యంతరం చెబితే సమావేశాన్ని వాయిదా వేసే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా బోర్డు సభ్యులు సమావేశం నిర్వహించి తమ నిర్ణయాలు తాము తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశానికి తెలంగాణ హాజరు కాకపోయినా... యధావిధిగా నడిచిపోయింది. అందుకే వెళ్లకుండా ఉండటం కన్నా.. వెళ్లి బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతోపాటు తెలంగాణ తరఫున లేవనెత్తాల్సిన వాటిని ప్రస్తావిస్తే బాగుంటుందనే అంచనాకు వచ్చారు.
ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశాన్ని కేఆర్‌ఎంబీ సమావేశ ఎజెండాలో చేర్చారు. జలవిద్యుత్ ఉత్పత్తి అంశంపై ఏపీ ఇటీవల ఫిర్యాదుచేసింది. ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని.. దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నీటి పంపకంపై ఒప్పందాలు జరిగాయి. కృష్ణా నికర జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు..513 టీఎంసీలు ఏపీకి అని 2015లోనే రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే అప్పట్నుంచి కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తూ వస్తోంది. అయితే... తాజాగా ఏర్పడిన వివాదంతో కేసీఆర్ ఒప్పందం చెల్లదనే వాదనను కేసీఆర్ తెరపైకి తీసుకు వచ్చారు. కృష్ణా జలాలు సగం సగం ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు. ఆ ఒప్పందం శాశ్వతం కాదని ఇప్పటికే కాలపరిమితి తీరిపోయిందని కృష్ణాబోర్డుకు చెప్పాలని అనుకుంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పట్లాగే 70, 30 నిష్పత్తితో నీటిపంపిణీ చేయాలని వాదిస్తోంది. 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. అప్పుడు సమావేశం హాట్ హాట్‌గా సాగే అవకాశం కనిపిస్తోంది.