Congress President Kharge: లేబర్ యూనియన్ లీడర్ నుంచి ఓటమి ఎరగని స్థాయికి, ఖర్గే రాజకీయ ప్రస్థానమిదే
Congress President Kharge: లేబర్ యూనియన్ లీడర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఖర్గే ఓటమి ఎరగని నేతగా ఎదిగారు.
Congress President Kharge:
ఎన్నో ఒడుదొడుకులు..
కాంగ్రెస్ సారథి ఎవరో అన్న ఉత్కంఠకు తెర పడింది. అందరూ ఊహించిన విధంగానే...మల్లికార్జున్ ఖర్గే భారీ విజయం సాధించారు. 24 ఏళ్ల తరవాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి...కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. నామినేషన్లు వేసిన నాటి నుంచే...అందరి మొగ్గు ఖర్గే వైపే ఉంది. కచ్చితంగా ఆయనే గెలుస్తారని పార్టీ వర్గాలు కూడా చెప్పాయి. నిజానికి...ఆయనను రాజకీయ వర్గాల్లో "గెలుపు గుర్రం"గా పిలుస్తారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 12 సార్లు బరిలోకి దిగిన ఖర్గే...కేవలం ఒకేఒకసారి ఓటమి చవి చూశారు. అది కూడా 2019లో. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి...వరుసగా ఎనిమిదో సారి అసెంబ్లీలోకి అడుగు పెట్టి నేతగా రికార్డు సృష్టించారు. కర్ణాటకలోని చిట్టపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 9 సార్లు విజయం సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఎదిగారు. 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో దళితుడి గానూ ఘనత సాధించారు. జగ్జజీవన్ రామ్ తొలిసారి ఈ పదవిని చేపట్టారు.
లా చదివి లేబర్ యూనియన్‌లోకి..
1942లో జులై 21న బీదర్‌లో జన్మించారు ఖర్గే. గుల్బర్గాలోని Seth Shankarlal Lahoti Collegeలో లా చదివారు. ఎన్నో లేబర్ యూనియన్ కేసులూ గెలిచారు. ఆ తరవాత ఆయనే..లేబర్ యూనియన్ లీడర్‌గా ఎదిగారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1972లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో Octroi Abolition Committeeకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
కర్ణాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవటంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించింది. లెథర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 1976లో ప్రాథమిక విద్యామంత్రిగా ఎన్నికయ్యారు. 16 వేల మంది ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉద్యోగావకాశాలు కల్పించారు. గుండు రావ్ క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్, రెవెన్యూ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. 2021ఫిబ్రవరి 16 నుంచి కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి 2022 అక్టోబర్ 1వ తేదీ వరకూ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో రైల్వే మంత్రిగా, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రిగానూ విధులు నిర్వర్తించారు. 2014-19 మధ్య కాలంలో లోక్‌సభలో కాంగ్రెస్ లీడర్‌గానూ ఉన్నారు.
థరూర్ అభినందనలు..
మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించటం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా ఆయనకు అభినందనలు చెబుతున్నారు. ఈ పోటీలో ఓటమి పాలైన శశిథరూర్ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. "మల్లికార్జున్ ఖర్గేకి కాల్ చేసి అభినందనలు తెలిపాను. ఏ విషయంలోనైనా పూర్తిమద్దతునిస్తానని చెప్పాను. మా పోటీతో కాంగ్రెస్ బలపడింది" అని ట్వీట్ చేశారు.
Called on our new President-elect Mallikarjun @kharge to congratulate him & offer him my full co-operation. @incIndia has been strengthened by our contest. pic.twitter.com/fwfk41T93q
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2022
Also Read: Congress New President: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే- ప్రత్యర్థి థరూర్‌పై భారీ విజయం