(Source: ECI/ABP News/ABP Majha)
Thermal Project : థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అదానీకి అంకితం, సీఎం జగన్ పై జనసేన నేతలు ఫైర్
ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయడానికి నెల్లూరు జిల్లాకు వచ్చిన జగన్, ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని అదానీకి అంకితం చేశారంటూ మండిపడ్డారు జనసేన నాయకులు. జగన్ నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు.
థర్మల్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి నెల్లూరు జిల్లాకు వచ్చిన జగన్, ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని అదానీకి అంకితం చేశారంటూ మండిపడ్డారు జనసేన నాయకులు. జగన్ నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. జగన్ ఎప్పుడొచ్చారు ఎప్పుడు వెళ్లారో అసలు దేనికి వచ్చారో కూడా ప్రజలకు తెలియడం లేదని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి.
అదానీకి అంకితం..
నెల్లూరు ప్రజలను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని అన్నారు మనుక్రాంత్ రెడ్డి. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని జాతికి అంకితం చేశారని చెప్పడం పెద్ద డ్రామా అన్నారు. దాన్ని ప్రైవేటు పరం చేస్తూ అదానీకి అంకితం చేశారని అన్నారు. రైతుల దగ్గర వందలాది ఎకరాలను తీసుకొని వారికి ఏపీ జెన్కోలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. ఉద్యోగాలకోసం స్థానికులు 250 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదని చెప్పారు. దౌర్జన్యంగా వారిని అక్కడినుంచి తరలించారని చెప్పారు. జగన్ పాలన, రాక్షస పాలనకు నిదర్శనంలా ఉందని అన్నారు మనుక్రాంత్ రెడ్డి.
బారికేడ్లు ఎందుకు..?
జగన్ ప్రయటన సందర్భంగా ముత్తుకూరులో దాదాపు 3 కిలోమీటర్లు బారికేడ్లు కట్టేశారని అన్నారు. అన్ని నియోజకవర్గాలనుంచి, అన్ని మండలాల నుంచి ప్రజలను అక్కడికి తరలించారని, కానీ ముత్తుకూరు మండలం నుంచి మాత్రం ఏ ఒక్కరినీ ఆహ్వానించలేదని అన్నారు. ముత్తుకూరు నుంచి స్థానికులు వస్తే వారు గొడవ చేస్తారని, అక్కడ బాధలను తెలియజేస్తారని, సభలో గందరగోళం చేస్తారనే అనుమానంతో వారిని సభ దగ్గరకు కూడా రానివ్వలేదని చెప్పారు. అన్యాయంగా భూములు లాక్కున్నారని, వారిని దూరంగా తరిమేశారని అన్నారు.
టెంపరరీ ఉద్యోగస్తులు అక్కడకు వస్తే వాళ్ళని కూడా తిరిగి వెనక్కి పంపించేశారని చెప్పారు జనసేన నాయకులు. జెన్కోలో నైట్ షిఫ్ట్ ఉద్యోగుల్ని అక్కడే ఉంచేశారని, డే షిఫ్ట్ వచ్చేవారినెవర్నీ లోపలకు రానీయలేదని దీన్నిబట్టి సీఎం జగన్ లో ఎంత అభద్రతా భావం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హెలికాప్టర్లో వచ్చి, ఎవరికి కనపడకుండా పరదాల మాటున దాగి, బ్యారికేడ్ల చాటుగా జగన్ వచ్చి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఇలా భయపడుతూ వచ్చే సీఎంని ప్రజలు ఇంతవరకూ చూడలేదన్నారు.
పవర్ ప్లాంట్ ను అదానీకి అంకితం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నామని అంటున్న జగన్, అంత సరదాగా ఉంటే, సాక్షి పేపర్ ని అంకితం చేసుకోండని చెప్పారు. భారతి సిమెంట్ ని అంకితం చేసుకోండని అన్నారు. లేదంటే జగన్ సంపాదించిన కోట్ల రూపాయలను అంకితం చేసుకోవాలన్నారు నెల్లూరు ప్రజలు ఎంతో కష్టపడి కాయ కష్టం చేసుకుంటూ ఉంటే వారి భూములు లాక్కొని పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలిస్తామని చెప్పారని, చివరకు దాన్ని ప్రైవేటు పరం చేస్తూ వారిని మోసం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ కి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు.