కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ, తరచూ ఎవరో ఒకరు అదృశ్యం
Kota News: రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి అదృశ్యమవడం సంచలనమవుతోంది.
Student Goes Missing in Kota: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు (Kota Studnets Missing) అదృశ్యమవుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ముగ్గురు ఇలానే మిస్ అయ్యారు. ఇప్పుడు మరో విద్యార్థి కూడా కనిపించకకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. NEET ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న 20 ఏళ్ల తృప్తి సింగ్ అదృశ్యమైంది. యూపీకి చెందిన ఈ యువతి దాదాపు 8 రోజులుగా కనిపించడం లేదు. మూడు రోజుల కిందట పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె హాస్టల్ పరిసరాల్లోని CC కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. NEET ప్రిపరేషన్ కోసం గతేడాది కోటాకి వచ్చిన తృప్తి సింగ్ ఓ పీజీలో ఉంటోంది. ఏప్రిల్ 21వ తేదీన పీజీ నుంచి కోచింగ్ సెంటర్‌కి బయల్దేరింది. ఉదయం 7 గంటలకు వెళ్లిన ఆమె ఇంత వరకూ మళ్లీ పీజీకి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ నంబర్ కూడా ట్రేస్ అవడం లేదు. పీజీ ఓనర్ అప్రమత్తమై ఏప్రిల్ 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతానికి ఓ ప్రత్యేక బృందం ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది.
తరచూ మిస్సింగ్ కేసులు..
కోటాలో ఇలా విద్యార్థులు అదృశ్యమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తరచూ ఇలా ఎవరో ఒకరు కనిపించకుండా పోతున్నారు. తల్లిదండ్రులు కోటా అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడాదిగా ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలా మిస్సింగ్ కేసులతో పాటు ఆత్మహత్యలూ పెరుగుతున్నాయి. ప్రిపరేషన్ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. "నేను చదవలేకపోతున్నాను" అంటూ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కోచింగ్ సెంటర్‌లు విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెట్టకూడదని ఆదేశించింది. పదేపదే టెస్ట్‌ల పేరుతో ఇబ్బంది పెట్టకూడదని సూచించింది. అయితే...అటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాయి. కొందరు విద్యార్థులు మరీ సున్నితంగా ఉంటున్నారని, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురై ఇలా చేసుకుంటున్నారని వాదిస్తున్నాయి.
అందుకే ఒత్తిడి..
అయితే...ఈ ఆత్మహత్యల్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోటాలోని అన్ని హాస్టల్స్‌లోని గదుల్లో ఫ్యాన్‌లకు స్ప్రింగ్‌లు ఏర్పాటు చేయించింది. ఇకపై ఎవరూ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే..అప్పటి నుంచి ఇలా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. రోజూ టెస్ట్‌లు ఉండడం, అందులో సరిగ్గా మార్క్‌లు రాకపోతే అందరి ముందూ గిల్టీగా ఫీల్ అవడం లాంటి సమస్యలతో చాలా మంది విద్యార్థులు బాధ పడుతున్నారు. అందుకే...వాళ్లకి రోజువారీ క్లాస్‌లతో పాటు సైకియాట్రిస్ట్‌లతోనూ కౌన్సిలింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని కొందరి సూచిస్తున్నారు. కానీ...ఈ సూచనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నలుగురు అదృశ్యం కాగా ఇప్పటి వరకూ వాళ్ల జాడ దొరక్కపోవడం ఆందోళనకరంగా మారింది.
Also Read: రూ.12 కోట్లు పలికిన టైటానిక్ ప్రయాణికుడి గోల్డ్‌వాచ్, వేలంలో రికార్డు