Joe Biden: నేను ప్రశాంతంగా నిద్రపోవాలి, రాత్రి 8 తరవాత ప్రోగ్రామ్‌లు పెట్టకండి - అధికారులకు బైడెన్ సూచన
Joe Biden Health: బైడెన్ ఆరోగ్యంపై రకరకాల వాదనలు వినిపిస్తున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నిద్ర ఎంతో అవసరమని తేల్చి చెప్పారు.
Joe Biden Health Status: అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్ ఆరోగ్య పరిస్థతిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో తన ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. తనుక నిద్ర ఎంతో అవసరమని, కొద్ది గంటలు మాత్రమే పని చేయగలనని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల తరవాత ఏ ప్రోగ్రామ్‌నీ పెట్టొద్దని చెప్పారు. New York Times వెల్లడించిన వివరాల ప్రకారం తన మద్దతుదారులతో ఈ విషయం చెప్పారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌ని ఢీకొట్టేందుకు రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను అధ్యక్ష రేసులోనే ఉన్నానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన బైడెన్ ఇప్పుడు హెల్త్ గురించీ మాట్లాడడం కీలకంగా మారింది.
ప్రస్తుతం జో బైడెన్ వయసు 81 ఏళ్లు. చాలా రోజులుగా ఆయన ప్రవర్తన హాట్ టాపిక్‌గా అవుతోంది. ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం, పక్కన ఉన్న వాళ్లను పట్టించుకోకపోవడం, పరధ్యానంలో ఉండడం లాంటివి ప్రత్యర్థుల విమర్శలకు తావిచ్చింది. కొద్ది నెలలుగా ఈ సమస్య మరీ ఎక్కువైంది. పైగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థి ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ పెద్దగా మాట్లాడలేకపోయారు బైడెన్. అయినా సరే తాను రేసులోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే...సరిగ్గా ఈ డిబేట్‌కి ముందు వరుస విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారు బైడెన్. ఈ కారణంగానే కాస్త అలిసిపోయి డిబేట్‌లో మాట్లాడలేకపోయారన్న వాదనా వినిపిస్తోంది.
మొదటి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారం చాలా చప్పగా సాగుతోంది బైడెన్‌పై విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడా విమర్శలకు సమాధానంగా గట్టిగానే క్యాంపెయిన్ చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో వర్క్ లోడ్ మరీ పెరగకుండా తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ చేయాలని అధికారులకు చెబుతున్నారు. రాత్రి వరకూ ప్రచారం సాగకుండా కాస్తంత ముందుగానే ముగిసేలా చూడాలని చెప్పారు. ఈ మీటింగ్‌లోనే బైడెన్ తన హెల్త్‌పై తానే జోక్ వేసుకున్నారు. "నేనైతే బాగానే ఉన్నాను. మరి నా బ్రెయిన్ సంగతేంటో మాత్రం నాకు తెలియదు" అని అందరినీ నవ్వించారు. అటు డొనాల్డ్ ట్రంప్ మాత్రం బెైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై అమెరికా ప్రజలు విశ్వాసం కోల్పోయారని తేల్చి చెప్పారు.
ఇటీవల జరిగిన డిబేట్‌లోనూ బైడెన్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఆయన వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఇలా దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తరవాత మళ్లీ అమెరికా అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో బైడెన్ తీసుకున్న నిర్ణయాలనూ ట్రంప్ తప్పుబట్టారు. ముఖ్యంగా తాలిబన్ల విషయంలో ఆయన పెద్ద తప్పు చేశారని అన్నారు. ప్రజలు ఆలోచించి మరోసారి బైడెన్‌ని ఎన్నుకోకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి.
Also Read: UK Election Results 2024: యూకే ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా, భావోద్వేగ ప్రసంగంతో వీడ్కోలు