Lokesh Speech: ఈ బొమ్మ అదుర్స్, జగన్‌కి జ్వరం గ్యారంటీ - పంచ్‌లతో వైసీపీని ఏకిపారేసిన లోకేశ్
Yuvagalam Navasakam: యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.
![Lokesh Speech: ఈ బొమ్మ అదుర్స్, జగన్‌కి జ్వరం గ్యారంటీ - పంచ్‌లతో వైసీపీని ఏకిపారేసిన లోకేశ్ Nara Lokesh speech in Yuvagalam Navasakam public meeting slams YS Jagan YSRCP telugu news Lokesh Speech: ఈ బొమ్మ అదుర్స్, జగన్‌కి జ్వరం గ్యారంటీ - పంచ్‌లతో వైసీపీని ఏకిపారేసిన లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/db19a3f579522f13f817e5e323d733d71703089487704234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nara Lokesh Comments in Yuvagalam Navasakam: జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నాడని.. దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వారిలో సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు ఉంటారని.. అబ్బో మామూలు టీం కాదని ఎగతాళి చేశారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.
బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ!
‘‘ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా. విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ. ఒక సారి జూమ్ వెయ్యండమ్మా జగన్ కి ఐమ్యాక్స్ సినిమా చూపిద్దాం. ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఇది ఆరంభం. ఇది నవశకం. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం. రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం. యువగళం..మనగళం..ప్రజాబలం
మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమన్నా - లోకేశ్
యువగళం పాదయాత్ర నేను కుప్పంలో మొదలుపెట్టాను. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసాను. యువగళాన్ని ఆపేందుకు జగన్ జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆ రోజే చెప్పా బ్రదర్ జగన్ జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలేదు అని. నా మైక్ వెహికల్ లాక్కున్నాడు. అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన గొంతు ఇది. ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పోలీసుల్ని పంపాడు యువగళం ఆగలేదు. వైసీపీ గూండాలను పంపాడు మన పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారు. బాంబులకే భయపడని బ్లడ్ మనది. బెదిరింపులకు భయపడతామా? భయం మా బయోడేటాలో లేదు బ్రదర్.
‘‘జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు అయితే.. మీ లోకేష్ ది అంబేద్కర్ రాజ్యాంగం పౌరుషం. ఒక పక్క యువగళం. మరో పక్క చంద్రబాబు గారి భవిష్యత్తుకి గ్యారెంటీ.. పవనన్నవారాహి యాత్రతో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. చంద్రబాబును చూస్తే జగన్ కి భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. విజనరీ అంటే చంద్రబాబు. ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడింది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎం గా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది.
జగన్ హయాంలో ఏపీ అప్పు 12 లక్షల కోట్లు!
పవనన్న ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు వైసీపీ పిరికి సన్నాసులు. ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారు. ఏపీ బోర్డర్ లో ఆపేస్తారు. జగన్ ఈ మధ్య పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. లక్ష కోట్లు దోచిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? జగన్ ఒక అప్పుల అప్పారావు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాశనం చేసాడు. జగన్ హయాంలో ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరబోతోంది. ఏడాదికి మనం కట్టాల్సిన వడ్డీ ఎంతో తెలుసా లక్ష కోట్లు.
అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే భారం మొయ్యాల్సింది ప్రజలే. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి... ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి. జగన్ కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్ సరిపోదా జగన్? స్టేడియంలు, గ్రౌండులలో ప్రాక్టీస్ చేయడానికి, ఆడ్డానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్.
నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకొక కంపెనీ విశాఖకు వచ్చేది. ఎన్నో కంపెనీలు నేను స్వయంగా ప్రారంభించాను. ఇప్పుడు ఆ కంపెనీలు అన్నీ తరిమేసాడు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలు అన్ని పక్కరాష్ట్రానికి పరార్. విశాఖని కేపిటల్ చేస్తానంటూ క్రైం కేపిటల్ చేశాడు. పరిపాలనా రాజధాని చేస్తానని కబ్జాల రాజధాని చేశాడు. రుషికొండ కు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నాడు. ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేసాడు. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు’’ అని నారా లోకేశ్ మాట్లాడారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)