Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?
హిమాలయాల్లో లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ బైక్ జర్నీ చేశారు నారా బ్రహ్మణి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nara Bramhani Bike Rider : హిమాలయాల్లో బైక్ రైడింగ్ చేయడం చాలా మంది యువత కల. ఎక్కువ మంది యువకులే ఈ విషయంలో ప్యాషనేట్‌గా ఉంటారు. అలా అని మహిళలు ఉండరనేం కాదు. ఉంటారు. కాకపోతే పురుషులతో పోలిస్తే తక్కువ. అలాంటి ప్యాషనేట్ బైక్ రైడర్స్‌లో ఒకరు నారా బ్రహ్మణి. మీరు చదివింది నిజమే. నందమూరి బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి కూడా ప్యాషనేట్ బైక్ రైడరే. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. ఆమెకు అది అభిరుచే కానీ.. పబ్లిసిటీ కోసం కాదు. కానీ ఓ బైక్ కంపెనీ ఆమె టీం సాహస బైక్ రైడింగ్ విశేషాలను వీడియో రూపంలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హిమాలయాలను సైతం అధిరోహించగలిగే సామర్థ్యం ఉన్న బైక్‌లను తయారు చేసే ఓ కంపెనీ ప్యాషనేట్ రేసర్లను ఓ టీంలను ఏర్పాటు చేసి.. తమ బైక్‌ల మీద ఇలా ట్రిప్‌లకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఓ ట్రిప్‌లో నారా బ్రహ్మణి పాల్గొన్నారు. ఇలాంటి ట్రిప్‌లలో టీమ్‌గా వెళ్తారు కానీ... ఎవరికీ లగేజీ వాళ్లే తీసుకెళ్లాలి. ఎవరూ సహాయంగా ఉండరు. బైక్‌కు ఏమైనా సమస్య వచ్చినా.. ప్రమాదం జరిగినా సాయం చేయడానికి కంపెనీ టీం ఉంటుంది కానీ.. మొత్తంగా శారీరక శ్రమతోనే బైక్ రేసింగ్ చేయాలి. ఇాలాంటి రేసింగ్‌ను నారా బ్రహ్మణి పూర్తి చేశారు. తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్ నుంచి లెహ్ వరకూ ఈ సాహస యాత్ర సాగింది. బైక్‌ను అలవోకగా నారా బ్రహ్మణి నడిపిన విధానం.. అందర్నీ ఆకట్టుకుంది. ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఈ వీడియోను చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు.
నారా బ్రహ్మణి నందమూరి కుటుంబంలో పుట్టినా.. నారా కుటుంబంలో కోడలికి వెళ్లినా డౌన్ టు ఎర్త్ ఉంటారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి... హెరిటేజ్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆమె నాయకత్వ లక్షణాలతో ఆ సంస్థ లాభాల్లో దూసుకెళ్తోంది. కుటుంబంలో ఎక్కువ మంది రాజకీయ నేతలు ఉన్నా... ఆ నీడ పడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా వ్యక్తిగత అభిరుచుల మేరకు హిమాలయన్ టూర్‌కు వెళ్లడం...ఆమె ప్లానింగ్‌కు నిదర్శనమన్న ప్రశంసలు వస్తున్నాయి.
నారా బ్రహ్మణి ప్రచారానికి దూరంగా ఉంటారు. హెరిటెజ్‌కు సంబంధించిన అంశాల్లో ప్రెస్‌మీట్లు పెట్టినప్పుడు మాట్లాడతారు తప్ప.. మరే విషయంలోనూ ఆమె మీడియాతో మాట్లాడరు. వ్యక్తిగత విషయాలను పూర్తిగా వ్యక్తిగతంగానే ఉంచుకుంటారు. మీడియాకు సమాచారం ఇవ్వరు. ఇప్పుడు కూడా ఆమె కానీ..ఆమె పీఆర్ టీం కానీ ఈ విషయం చెప్పలేదు. బైక్ కంపెనీ పెట్టిన వీడియోలో చూసిన కొంత మంది ఆశ్చర్యపోయి సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైరల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఈ వీడియోనే.