Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
ఆర్యన్ ఖాన్‌తో ఓ ఫొటోలో ఉన్న వ్యక్తిపై పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆ వ్యక్తికి డ్రగ్స్ కేసుకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఓ ఫోటో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫోటోలో ఆర్యన్ ఖాన్‌తో ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరని నెటిజన్లు వెతుకుతున్నారు. అయితే ఈ విషయంపై పుణె పోలీసులు కూడా దృష్టి పెట్టారు. కేపీ గోసవీపై పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఈ విషయాన్ని పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా ధ్రువీకరించారు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని పుణె వ్యక్తిని మోసం చేశాడంటూ గోసవీపై కేసు నమోదైంది. గోసవీ.. దేశం విడిచిపోకుండా ఉండేందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెయిల్‌పై విచారణ..
మరోవైపు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ పిటిషన్‌పై ఎన్‌సీబీ నిన్న ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇందులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో డ్రగ్స్ దాయడం, వినియోగించడంలో ఆర్యన్ పాత్ర ఉందని ఎన్‌సీబీ పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకు మూడుసార్లు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఏం జరిగిందంటే..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి ఈ నెల 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం